President Droupadi Murmu Addresses Parliament: ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధి సాధించిందని.. త్వరలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) అన్నారు. కొత్తగా కొలువుదీరిన 18వ లోక్‌సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె గురువారం ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ (Parliament) చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె సభలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించారు. ఈ సందర్భంగా 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులను అభినందించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని అభినందించారు. 'ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచిన మీరంతా సభకు వచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో విజయవంతమవుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చాలి.' అని రాష్ట్రపతి అన్నారు.


'శత్రువుల కుట్రకు గట్టి జవాబు'


జమ్మూకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. కానీ, ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కనిపించిందని.. అక్కడి ప్రజలు శత్రువుల కుట్రలకు గట్టి బదులిచ్చారని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని వెల్లడించారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ (సంస్కరణలు, పనితీరు, మార్పు) ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని.. త్వరలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు. 'ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకూ రూ.3.20 లక్షల కోట్లు ఇచ్చాం. రైతుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తూ ఆర్థిక భరోసా అందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆర్గానికి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన క్రమంలో అందుకు అనుగుణంగా భారత్ ఉత్పత్తులు అందిస్తోంది.' అని పేర్కొన్నారు.


'ఆరోగ్య రంగంలో అగ్రగామి'










'భారతదేశం ఆరోగ్యం రంగంలో అగ్రగామిగా ఉంది. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాం. ప్రపంచ వృద్ధిలో భారత్ 15 శాతం భాగస్వామ్యం అవుతోంది. అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.  గ్రీన్ ఎనర్జీ దిశగా ప్రభుత్వం పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ వేగంగా సాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. డిజిటల్ ఇండియా సాధనకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేశాం. సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పింఛన్ అమలు చేశాం. రక్షణ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. సీఏఏ కింద శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి రానున్నాయి.' అని రాష్ట్రపతి వెల్లడించారు.


పరీక్షల్లో పారదర్శకతపై






ఇటీవల నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, నిర్వహించే ప్రవేశ పరీక్షలు పారదర్శకంగా జరగాలని అన్నారు. పేపర్ లీక్స్, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నత స్థాయిలో విచారణ జరుగుతోందని చెప్పారు. 'ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరముంది. నీట్, ఇతర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. పేపర్ లీక్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు.


Also Read: Lal Krishna Advani: ఎల్కే అద్వానీకి అనారోగ్యం-ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స