Lal Krishna Advani admitted to Delhi AIIMS: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి ఆయన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. 


వయసు రీత్యా సమస్యలు తలెత్తడంతో అద్వానీని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ బీజేపీ సీనియర్ నేతను ఎయిమ్స్‌లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. అద్వానీ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఎయిమ్స్‌లో చేరారు.


ఈ ఏడాదే భారతరత్న 
ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్ బులెటిన్ ఇంకా వైద్యులు ఇవ్వలేదు. 9 గంటలకు ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు అద్వానీ మెడికల్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన విషయం తెలిసిందే.


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్ కే అద్వానీకి ఆయన నివాసంలోనే భారతరత్న ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అద్వానీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేశారు.


ఎల్ కే అద్వానీ ఎవరు?
పాకిస్తాన్‌లో ఉన్న కరాచీలో అద్వానీ 1927 నవంబర్ 8న జన్మించారు. 1947 సెప్టెంబర్ 12న తాను పాకిస్థాన్‌ను విడిచి వచ్చారు. ఆ తర్వాత నెల రోజులకు కుటుంబం భారతదేశానికి వచ్చింది. లాల్ కృష్ణ అద్వానీకి కుమార్తె ప్రతిభా అద్వానీ, కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు.  వాళ్లిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.