New Rules In Health Insurance Policy Claim: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల విషయంలో 'ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (IRDAI) చాలా రూల్స్‌ మార్చింది. బీమా కంపెనీలకు కాకుండా, బీమా పాలసీ తీసుకున్న వ్యక్తులకు అనుకూలంగా నియమాలను సవరించింది. ఆరోగ్య బీమాను ఆకర్షణీయంగా మార్చడంతో పాటు, అందరికీ అందుబాటులో ఉండేలా సవరణలు చేసింది. IRDAI తీసుకున్న చొరవ కారణంగా, ఈమధ్య కాలంలో, మన దేశంలో ఆరోగ్య బీమా పాలసీల రూల్స్‌లో చాలా మార్పులు వచ్చాయి.


ఆరోగ్య బీమా క్లెయిముల్లో వచ్చిన కొత్త నియమాలు (New rules of health insurance claims)


1. ఇప్పుడు ఎక్కడైనా నగదు రహిత చికిత్స
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చేరితే, అక్కడ, చికిత్స కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ఆసుపత్రి క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ నెట్‌వర్క్‌లో లేనప్పటికీ బీమా సంస్థ నుంచి వైద్య ఖర్చుల కోసం క్లెయిమ్ (Cashless health insurance claims) చేయవచ్చు. ఈ రూల్‌ తీసుకురావడానికి ముందు, నెట్‌వర్క్‌లో లేని ఆసుపత్రిలో పాలసీదారు జాయిన్‌ అయితే, ముందుగా ఆ వ్యక్తి జేబులో నుంచి చెల్లించాల్సి వచ్చేది. డిశ్చార్జ్ అయిన తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేసేవాళ్లు. 


2. క్లియరెన్స్ సమయం
పాలసీ తీసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యే సమయంలో, ఆసుపత్రి నుంచి సదరు బీమా కంపెనీ క్లెయిమ్‌ను స్వీకరిస్తే, దానిని 3 గంటల లోపు క్లియర్ ‍‌(Cashless claim clearance time) చేయాలి. పేషెంట్‌ అడ్మిషన్ సమయంలో నగదు రహిత క్లెయిమ్‌లను ఒక గంటలో క్లియర్ చేయాలి.


3. వెయిటింగ్ పిరియడ్ తగింపు
ఈ రూల్‌ రాక ముందు, ఒక వ్యక్తి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసే సమయంలోనే నిర్దిష్ట అనారోగ్యాలు లేదా వ్యాధి/వ్యాధులు ఉన్నట్లయితే, అతను ఇన్సూరెన్స్‌ పాలసీని క్లెయిమ్ చేయడానికి 4 సంవత్సరాలు ‍‌ఎదురు చూడాల్సి వచ్చేంది. దీనిని వెయిటింగ్‌ పిరియడ్‌ (Waiting period) అంటారు. ఈ వెయిటింగ్ పీరియడ్‌ను ఇప్పుడు 3 సంవత్సరాలకు తగ్గించారు. ఈ మూడేళ్ల తర్వాత, ముందస్తు వ్యాధులు లేదా అనారోగ్యాలకు కూడా బీమా పాలసీ వర్తిస్తుంది.


4. ఆయుష్ చికిత్సలకు గుర్తింపు
ఆయుష్ చికిత్సలను (ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి) ఇన్సూరెన్స్ రెగ్యులేటర్‌ (IRDAI) అధికారికంగా గుర్తించింది. ఈ విధానాల్లో చికిత్స (Ayush treatment) తీసుకున్న పాలసీ హోల్డర్‌ పెట్టుకున్న క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరించలేదు.


5. మారటోరియం పిరియడ్‌ తగ్గింపు
ఒక వ్యక్తి ఐదేళ్ల నిరంతర కవరేజీతో ‍‌ఆరోగ్య బీమా ప్లాన్‌ తీసుకుంటే... కొన్ని విషయాలను ముందుగానే తమకు చెప్పలేదు లేదా తప్పుగా చెప్పాడు వంటి సాకులు చూపి ఆ క్లెయిమ్‌ను ఇన్సూరెన్స్‌ కంపెనీలు తిరస్కరించలేవు. పాలసీదారు కావాలని మోసం చేశాడని నిరూపిస్తేనే తిరస్కరించగలవు. గతంలో ఈ కవరేజ్‌ పిరియడ్‌ (Moratorium period‌) 8 సంవత్సరాలుగా ఉంది.


6. ఒకే సమయంలో ఎక్కువ బీమా క్లెయిమ్‌లు
పాలసీదారు ఆసుపత్రిలో చేరిన తర్వాత, ఎక్కువ ఆరోగ్య బీమా పాలసీల నుంచి క్లెయిమ్ చేయవచ్చు. ఉదాహరణకు... పాలసీ హోల్డర్‌ దగ్గర రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల విలువైన రెండు పాలసీలు ఉన్నాయనుకుందాం. ఆ వ్యక్తి ఆసుపత్రి బిల్లు రూ. 12 లక్షలు అయితే, ఆ బిల్లు సెటిల్ చేయడానికి తన దగ్గర ఉన్న రెండు పాలసీలను ఉపయోగించుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: గ్యాస్ సిలిండర్‌ లీక్ అయితే వెంటనే ఇలా చేయండి, లేకపోతే ఇల్లు పేలిపోతుంది