EPF New Withdrawl Rules 2024: ఈపీఎఫ్ క్లెయిమ్‌ల విషయంలో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (Employees' Provident Fund Organisation) కొత్త సౌలభ్యాలు తీసుకువస్తూనే ఉంది. సాధారణంగా, ఈపీఎఫ్ కోసం ఒక చందాదారు (EPFO Subscriber) క్లెయిమ్ చేసుకున్నప్పుడు, వర్తించే అన్ని నిబంధనలను అతను సంతృప్తి పరచాలి. ఒక్క నియమం పాటించకపోయినా క్లెయిమ్ దరఖాస్తును సంబంధిత ప్రాంతీయ కార్యాలయం (EPFO Regional Office) తిరస్కరిస్తుంది. ఇలా తిరస్కరించే కారణాల్లో... బ్యాంక్ చెక్ లీఫ్, బ్యాంకు పాస్ పుస్తకం కాపీని సమర్పించకపోవడం కూడా ఒకటి.
చెక్ లీఫ్ లేదా అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ కాపీని అప్‌లోడ్ చేయనందుకు EPFO రీజినల్ ఆఫీసులు వేలకొద్దీ క్లెయిమ్స్ తిరస్కరిస్తున్నాయి. ఈ సమస్యకు EPFO ఒక చక్కటి పరిష్కారం చూపింది. ఆధార్ KYC పూర్తయితే చాలని చెప్పింది. ఈ వెసులుబాటు వల్ల, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం చెక్ లీఫ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిన లేదా ఫిజికల్‌గా సమర్పించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్స్ వేగవంతం అవుతాయి.
ఒక షరతు వర్తిస్తుంది
చెక్ లీఫ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్‌ను సమర్పించకపోయినా EPF క్లెయిమ్ చేసుకోవాలంటే, ముందుగా, చందాదారుడి బ్యాంకు ఖాతాలో KYC పూర్తయి ఉండాలి. అంటే, క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ఆధార్ KYC పూర్తయి ఉండాలి. ఆధార్ KYC ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్ లీఫ్, బ్యాంక్ పాసు బుక్ కాపీని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవి లేకుండానే క్లెయిమ్ సెటిల్ అవుతుంది.
KYC పూర్తయిన చందాదారు క్లెయిమ్ కోసం అప్లై చేసుకుంటే, "బ్యాంక్ KYC అథెంటికేషన్ ఆన్‌లైన్‌లో పూర్తయింది. చెక్ లీఫ్, పాస్ బుక్ కాపీని సమర్పించాల్సిన చేయాల్సిన అవసరం లేదు" అనే సూచన సంబంధిత రీజినల్ ఆఫీసుకు ఆన్‌లైన్ క్లెయిమ్ ఫామ్‌లో కనిపిస్తుందని EPFO ప్రకటించింది. ఈ సూచన కనిపిస్తే, చెక్ లీఫ్, పాస్ బుక్ కాపీ కోసం చూడకుండా క్లెయిమ్ సెటిల్ చేయాలని ప్రాంతీయ కార్యాలయాను ఆదేశించింది.
ఆన్‌లైన్‌లో EPF క్లెయిమ్ ఎలా చేయాలి? (How to claim EPF online?)
-- ముందు, https://unifiedportal-mem.epfindia.gov.in/ లింక్ ద్వారా EPFO అధికారిక పోర్టల్‌లోకి వెళ్లాలి. UAN, పాస్‌వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి.
-- హోమ్ పేజీలో, క్లెయిమ్ సెక్షన్‌పై క్లిక్ చేయండి.
-- పెన్షన్ లేదా ఫుల్ సెటిల్‌మెంట్ వంటి క్లెయిమ్ రకాన్ని ఎంచుకోండి.
-- ఇక్కడ, ముందుగానే పూరించిన వివరాలు ఉంటాయి. ఆ వివరాలను ఒకసారి క్రాస్ చెక్ చేయండి.
-- ఒకవేళ ఆధార్ KYC పూర్తయితే, EPFO ఇచ్చిన కొత్త వెసులుబాటు సబ్‌స్క్రైబర్‌కు ఇక్కడ ఉపయోగపడుతుంది.
-- ఆ తర్వాత, ఆ పేజీలో ఉన్న మొత్తం సమాచారాన్ని మీరు ధృవీకరించాలి, ఆ తర్వాత క్లెయిమ్ సబ్మిట్ చేయాలి.
-- ఇక్కడి నుంచి జరగాల్సిన పనిని EPFO రీజినల్ ఆఫీస్ చూసుకుంటుంది, తగిన పరిశీలన తర్వాత మీ క్లెయిమ్‌కు ఆమోదం తెలుపుతుంది.
మీరు సమర్పించిన క్లెయిమ్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి ఇదే పోర్టల్‌లో స్టేటస్ చెక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
మరో ఆసక్తికర కథనం: బడ్జెట్ నంబర్ 7 - మేడమ్ నంబర్ 1- కొత్త రికార్డు దిశగా నిర్మలా సీతారామన్