Finance Minister Nirmala Sitharaman: ప్రధాన మంత్రిగా మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ, సోమవారం, తన మంత్రులందరికీ శాఖలు అప్పగించారు. కీలక శాఖలకు మంత్రులను మార్చకుండా పాత వారికే అప్పగించారు. దీంతో, నిర్మల సీతారామన్‌కు మరోమారు ఆర్థిక శాఖ దక్కింది. తద్వారా, దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో నిర్మల సీతారామన్‌పై మోదీ మరోమారు విశ్వాసం ఉంచారు.


వరుసగా ఏడో బడ్జెట్‌తో రికార్డ్‌
మోదీ 2.0 ప్రభుత్వంలో నిర్మల సీతారామన్‌ ఐదేళ్ల పాటు, అంటే పూర్తి కాలం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఆరు బడ్జెట్‌లు సమర్పించిన ఆర్థిక మంత్రిగా గత రికార్డ్‌ను సమం చేశారు. ఈ రికార్డ్‌ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. వచ్చే నెలలో (జులై 2024‌), మోదీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రి హోదాలో ఆ పద్దులను నిర్మలమ్మ ప్రకటిస్తారు. నిర్మల సీతారామన్‌కు అది ఏడో కేంద్ర బడ్జెట్‌ అవుతుంది. తద్వారా, "వరుసగా" అత్యధిక బడ్జెట్‌లు సమర్పించిన రికార్డ్‌ ఆమె సొంతం అవుతుంది. అయితే... వరుసగా కాకున్నా, అత్యధికంగా 10 బడ్జెట్‌లు సమర్పించిన రికార్డ్‌ మొరార్జీ దేశాయ్ పేరిట భద్రంగా ఉంది. ఈ రికార్డ్‌ను నిర్మలమ్మ బద్దలు కొట్టాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.


రెండుసార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన నిర్మల సీతారామన్, 2019 పూర్తి స్థాయి బడ్జెట్‌తో ప్రారంభించి వరుసగా ఆరు బడ్జెట్‌లు సమర్పించారు. వీటిలో 5 పూర్తి స్థాయి బడ్జెట్‌లు, ఒకటి మధ్యంతర బడ్జెట్ (ఈ ఏడాది ఫిబ్రవరిలో) ఉన్నాయి. దీనికి ముందు, ఆమె కొన్ని నెలల పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు.


ఆర్థిక మంత్రిగా కీలక సంస్కరణలు
64 ఏళ్ల నిర్మల సీతారామన్, 2019లో అరుణ్ జైట్లీ నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించారు. దీంతో, మన దేశంలో పూర్తి పదవీ కాలానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డ్‌ సృష్టించారు. ఆర్థిక మంత్రిగా ఆమె చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. వాటిలో ప్రధానమైనది 'బేస్‌ కార్పొరేట్ టాక్స్‌'ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం. కొవిడ్ మహమ్మారి కూడా నిర్మలమ్మ హయాంలోనే విరుచుకుపడింది. ఆనాటి ఆర్థిక సవాళ్ల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా ఆమె ప్రకటించారు. ఇది భారతదేశ GDPలో దాదాపు 10 శాతం.


గరిష్టంగా 10 బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్
బడ్జెట్‌ రికార్డ్‌ల విషయానికి వస్తే, మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. 9 బడ్జెట్‌లతో పి.చిదంబరం రెండో స్థానంలో నిలిచారు. 8 బడ్జెట్‌లతో ప్రణబ్ ముఖర్జీ మూడో స్థానంలో ఉన్నారు. యశ్వంత్ సిన్హా 7 బడ్జెట్‌లు, సి.డి.దేశ్‌ముఖ్ 7 బడ్జెట్‌లు, మన్మోహన్ సింగ్ 6 బడ్జెట్‌లు సమర్పించారు. భారతదేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరా గాంధీ. అయితే ఆమె ప్రధానిగా పని చేస్తూ బడ్జెట్‌ సమర్పించారు.


మరో ఆసక్తికర కథనం: సిల్వర్‌ కొనేవాళ్లకు భలే చౌక బేరం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి