Chandrababu Swearing Ceremony Arrangements: ముఖ్యమంత్రి (AP New CM)గా నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రమాణ స్వీకార (Swearing Ceremony) కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యక్రమానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలను సైతం తట్టుకునేలా భారీగా గుడారాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సభా వేదిక, ప్రాంగణంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనాయకులు, జనసేనాని పవన్ కల్యాణ్, 164 మంది కూటమి ఎమ్మెల్యేలు, 21 మంది లోక్ సభ సభ్యులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతాపరమైన లోపాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇన్చార్జులకు బాధ్యతలు 
సభా ప్రాంగణంలో  ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేసి ఇన్చార్జీలను నియమించారు. మంచినీరు, అల్పాహారం, ఇతర సౌకర్యా లను కల్పించాల్సిన బాధ్యత ఇన్చార్జీలకు అప్పగించారు. వీవీఐపీలకు పాసుల ప్రకారం సీటింగ్ కేటాయించాల్సి ఉంటుంది. ఆయా సీట్లలో వారిని కూర్చోబెట్టే బాధ్యతను గ్యాలరీ ఇన్చార్జికే అప్పగించారు. సీనియర్ అధికారులు ప్రద్యుమ్న, వీరపాండ్యన్ ఈ  ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 


అధికారులతో వీరపాండ్యన్ సమీక్ష
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కార్యక్రమ ప్రత్యేక అధికారి జి.వీర పాండ్యన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విధుల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. మూడు కేటగిరీల్లో మొత్తం 36 గ్యాలరీలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రత్యేక అతిథులు, వీవీఐపీలు, వీఐపీలు, మీడియా ప్రతినిధులకు సంబంధించిన గ్యాలరీల విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్యాలరీకి ప్రత్యేకంగా వాటర్ టీం, శానిటేషన్ టీం, మెడికల్ టీం ఉంటాయని తెలిపారు. ఈ బృందాల సభ్యులతో గ్యాలరీల ఇన్చార్జులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు గ్యాలరీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారని వివరించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఎస్పీజీ భద్రత ఉంటుందని, భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. 


ప్రత్యేక బందోబస్తు
చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం నేపథ్యంలో విజయవాడ నగరంలో ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ వెల్లడించారు. ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు వస్తున్న సందర్భంగా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి బెంజి సర్కిల్ వరకు, బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు, రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు, కారల్ మార్క్స్ రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి అధికారులతో చర్చించారు. రామవరప్పాడు, ఇతర ప్రాంతాల నుంచి ప్రమాణ స్వీకారం జరిగే ప్రాంతానికి పాసులు ఉన్న బస్సులు, వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. ప్రముఖులు పర్యటించే మార్గాలో నిరంతరం ట్రాఫిక్ పర్యవేక్షణ ఉంటుందని, ముఖ్య ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


నియోజకవర్గానికి నాలుగు బస్సులు
ప్రమాణ స్వీకారానికి వచ్చే జనం కోసం నియోజకవర్గానికి 4 బస్సుల చొప్పున కేటాయించారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. సభకు మొత్తం 3 లక్షలకు పైగానే జనం వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశి నేని శివనాథ్ చెప్పారు. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు విజయవాడ నగరంలో 9 ప్రాంతాల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, స్వరాజ్యమైదానంలోని అంబేడ్కర్ విగ్రహం, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, లెనిన్ కూడలి, పటమట జెడ్పీ బాలుర ఉన్నతపాఠశాల, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, జింఖానా మైదానం, విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.