US-India Ties: 


భారత్‌తో బలమైన బంధమే అమెరికాకు మంచిదని రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్‌ రామస్వామి అంటున్నారు. కమ్యూనిస్టు చైనాపై ఆధారపడొద్దంటే ఇదొక్కటే మార్గమని స్పష్టం చేశారు. డ్రాగన్‌ దేశాన్ని అడ్డుకోవాలంటే న్యూదిల్లీతో సైనిక సంబంధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


రెండో తరానికి చెందిన ఇండో అమెరికన్‌ వివేక్‌ రామస్వామి. 2014లో ఆయన రాయివంట్‌ సైన్సెస్‌ను స్థాపించారు. 2015, 2016లో అతిపెద్ద బయోటెక్‌ ఐపీవోకు నడిపించారు. అనేక ఉత్పత్తులకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు సాధించారు. కంపెనీని అగ్రగామిగా మార్చారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడాలని నిర్ణయించుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నారు. ఈ పోటీలో డొనాల్డ్‌ ట్రంప్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు.


చైనా నుంచి అమెరికా విముక్తి పొందినట్టు ప్రకటించాలంటే పటిష్ఠమైన భారత్‌-అమెరికా బంధం అవసరమని వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) అంటున్నారు. ఇప్పటికీ అనేక అవసరాల కోసం చైనాపై అమెరికా ఆధారపడుతోందని వెల్లడించారు. అండమాన్‌ సముద్ర జలాల్లో భారత్‌తో సైనిక బంధం అవసరమని నొక్కి చెప్పారు. అవసరమైతే మలక్కా జల సంధి వద్ద చైనా నౌకలను అడ్డుకోవచ్చని తెలిపారు. డ్రాగన్‌ కంట్రీకి ఎక్కువగా ఇంధనం ఇక్కడి నుంచే వస్తోందన్నారు. తాను ఈ మేరకే నడుచుకుంటానని వెల్లడించారు.


భారత్‌కు నరేంద్రమోదీ సరైన నాయకుడని వివేక్‌ రామస్వామి అన్నారు. అమెరికా ప్రయోజనాలను కాపాడలేకపోవడమే యూఎస్‌ పారిన్‌ పాలసీకి అతిపెద్ద సవాలని పేర్కొన్నారు. యుద్ధాలు చేయడం వల్ల అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో కలుగజేసుకోవడం పెద్ద తప్పని స్పష్టం చేశారు. దీంతో అంతర్జాతీయ వేదికల్లో యూఎస్‌ క్రెడిబిలిటీ దెబ్బ తింటోందన్నారు.


కమ్యూనిస్టు చైనాను అడ్డుకోవడంపై అమెరికా దృష్టి సారించాలని వివేక్‌ అంటున్నారు. తమకున్న అతిపెద్ద ముప్పు అదేనని స్పష్టం చేశారు. సొంత దేశాన్ని కాపాడుకోవడానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అణ్వస్త్రాలు, అణ్వస్త్ర క్షిపణులు, ఎలక్ట్రో మాగ్నెటిక్‌ పల్స్‌ స్ట్రైకర్స్‌, సైబర్‌ దాడులను అడ్డుకోవాలని సూచించారు. మన ఆధునిక జీవితాలు బాగుండాలంటే కమ్యూనిస్టు చైనాపై ఆధారపడకుండా చూసుకోవాలన్నారు. ఉక్రెయిన్‌ అంశంలో రెండు పార్టీలు ప్రాధాన్యాలను మర్చిపోయాని వివరించారు.


మరి కొన్ని నెలల్లో అమెరికా ఎన్నికలు మొదలవుతాయి. రిపబ్లిక్ పార్టీ రేసులో వివేక్‌ రామస్వామి రెండో స్థానంలో ఉన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటి ప్లేస్‌లో ఉన్నారు. ఒకవేళ ఆయన రెండోసారి అధ్యక్షుడైతే రామస్వామి ఉపాధ్యక్షుడిగా నియామకం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే ఈ పదవి చేపట్టి అత్యంత పిన్న వయస్కుల్లో రెండో వ్యక్తిగా నిలుస్తారు. అంతకు ముందు జాన్‌  బ్రెకిన్‌రిడ్జ్‌ 36 ఏళ్లకే ఈ పదవిని చేపట్టారు.


Also Read: ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేయొచ్చా!