Stock Market on 24 November 2023: ప్రపంచ మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో దేశీయ ఈక్విటీలు నిన్న (గురువారం) పేలవంగా పని చేశాయి, ఈ రోజు కూడా సేమ్‌ సీన్‌ కనిపించవచ్చు. నిన్న, సెకండరీ మార్కెట్ రేంజ్‌-బౌండ్‌లోనే కదలినప్పటికీ, ప్రైమరీ మార్కెట్‌లో (IPO మార్కెట్‌) చాలా హుషారు కనిపించింది.


థాంక్స్ గివింగ్‌ సందర్భంగా US మార్కెట్లు గురువారం పని చేయలేదు, ఈ రోజు హాఫ్‌ డే పని చేస్తాయి.


ఆసియా మార్కెట్లలో... జపాన్‌లో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌ నెలలోని 3 శాతం నుంచి అక్టోబర్‌లో 3.3 శాతానికి పెరిగింది. దీంతో, అక్కడి సెంట్రల్ బ్యాంక్ దాని అల్ట్రా-లూజ్ పాలసీని పక్కనబెట్టి, రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో నికాయ్‌ ఈ ఉదయం 1 శాతం పెరిగింది,


దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.14 శాతం క్షీణించగా, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 1.56 శాతం క్షీణించింది.


ఈ రోజు ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 10 పాయింట్లు లేదా 0.05% రెడ్‌ కలర్‌లో 19,868 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ONGC, HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ రిఫైనింగ్ విభాగంలోని గ్రీన్ ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చుకోవడానికి రైట్స్‌ ఇష్యూని ప్రారంభించే అంశాన్ని పరిశీలించమని ONGCని సూచించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా సుమారు 1.9 బిలియన్‌ డాలర్లు  (సుమారు రూ.15,500 కోట్లు) సేకరించవచ్చు.


TCS: ఈ రోజు TCS స్టాక్ ఎక్స్-బైబ్యాక్ అవుతుంది. ఒక్కోటి రూ.4,150 చొప్పున రూ.17,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసేందుకు ఈ కంపెనీ గతంలో ఆమోదించింది.


పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC): బాండ్స్‌ జారీ ద్వారా రూ.3,500 కోట్ల వరకు సమీకరించనున్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని PFC తెలిపింది.


RVNL: 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ కంపెనీ బోర్డ్‌లో అవసరమైన సంఖ్యలో స్వతంత్ర డైరెక్టర్లు లేకపోవడంతో, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌పై (RVNL), స్టాక్‌ ఎక్స్ఛేంజీలు BSE & NSE కలిపి రూ. 10 లక్షలకు పైగా జరిమానా విధించాయి.


JSW స్టీల్: JSW పెయింట్స్‌లో రూ. 750 కోట్ల మొత్తం పెట్టుబడిని JSW స్టీల్ పూర్తి చేసింది. దీంతో, ఇప్పుడు JSW పెయింట్స్‌లో JSW స్టీల్‌ వాటా 12.84 శాతానికి పెరిగింది. వ్యూహాత్మక పెట్టుబడికి సంబంధించి కేటాయింపును పూర్తి చేసినట్లు JSW పెయింట్స్ కూడా వెల్లడించింది.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI): ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా (ICRA), యూనియన్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను AAAకి అప్‌గ్రేడ్ చేసింది. బ్యాంక్‌ ఔట్‌లుక్‌ను 'పాజిటివ్' నుంచి 'స్టేబుల్'కి సవరించింది.


భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL):  2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ కంపెనీ బోర్డ్‌లో తగినంత సంఖ్యలో స్వతంత్ర డైరెక్టర్లు లేనందున, BELకు, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు NSE & BSE తలో రూ. 1.82 లక్షల జరిమానా విధించాయి.


IRCTC: సెప్టెంబరు చివరి నాటికి బోర్డులో అవసరమైన సంఖ్యలో స్వతంత్ర డైరెక్టర్లు లేనందున ఎక్స్ఛేంజీలు NSE & BSE కలిసి IRCTCకి రూ. 5.4 లక్షల ఫైన్‌ విధించాయి.


PFC: పవర్ ఫైనాన్స్ కార్ప్ బాండ్ల జారీని పరిశీలిస్తోంది. 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే బాండ్ల ఇష్యూ ద్వారా కనీసం రూ. 600 కోట్లు (72 మిలియన్‌ డాలర్లు) సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తున్నట్లు ముగ్గురు బ్యాంకర్లు గురువారం తెలిపారు.


లుపిన్: శస్త్రచికిత్స అనంతరం ఆ భాగంలో వచ్చే నొప్పిని తగ్గించే చికిత్సలో ఉపయోగించే బ్రోమ్‌ఫెనాక్ ఆప్తాల్మిక్ సొల్యూషన్ కోసం US FDA నుంచి లుపిన్‌కు ఆమోదం వచ్చింది.


మరో ఆసక్తికర కథనం: క్రెడిట్ కార్డ్‌తో కొంటున్నారా, ఆ మొత్తాన్ని EMIల్లోకి మార్చడం ఇకపై కష్టం కావచ్చు!