Stock Market Today, 22 April 2024: వివిధ ప్రాంతాల్లోని భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు క్రమంగా చల్లబడుతుండడంతో గ్లోబల్‌ మార్కెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు చల్లగా చూడడంతో ఈ రోజు (సోమవారం) దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సానుకూలంగా స్టార్ట్‌ కావచ్చు. 


శుక్రవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,147 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,280 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో.. ఈ ఉదయం జపాన్‌కు చెందిన నికాయ్‌ 0.49 శాతంతో గ్రీన్‌లో ట్రేడవుతుండగా, బ్రాడ్-బేస్డ్ టోపిక్స్ 1.23 శాతం పెరిగింది. దక్షిణ కొరియాలోని కోస్పి 0.59 శాతం ఎగబాకింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 1.18 శాతం పెరిగింది. హాంకాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్‌ కూడా 2.29 శాతం పైకి చేరింది.


శుక్రవారం అమెరికన్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. S&P 500 0.88 శాతం తగ్గితే, నాస్‌డాక్ కాంపోజిట్ 2.05 శాతం పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.56 శాతం పెరిగింది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.654 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $86 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గోల్డ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది, ఔన్సుకు $2,390 దగ్గర ఉంది. 
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్, రాలిస్ ఇండియా, మహీంద్ర లాజిస్టిక్స్, హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్, తేజాస్ నెట్‌వర్క్స్.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభంలో 37.1 శాతం జంప్‌తో రూ. 16,512 కోట్లు మిగుల్చుకుంది. అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.12,047 కోట్లుగా ఉంది. Q4 FY24లో నికర వడ్డీ ఆదాయం (NII) 24.5 శాతం పెరిగి రూ. 29,080 కోట్లకు చేరుకుంది.


విప్రో: 2023-24 నాలుగో త్రైమాసికంలో రూ. 2,835 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, ఏడాది క్రితంతో పోలిస్తే ఇది దాదాపు 8 శాతం తగ్గింది. మార్చి త్రైమాసికంలో ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 4.2 శాతం క్షీణించి రూ. 22,208 కోట్లకు పరిమితమైంది.


జియో ఫైనాన్షియల్ సర్వీసెస్: FY24 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 311 కోట్ల నికర లాభాన్ని నివేదించింది, ఇది QoQలోని రూ. 294 కోట్లతో పోలిస్తే 6 శాతం పెరిగింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ. 418 కోట్లకు చేరుకుంది, అంతకుముందు త్రైమాసికంలోని రూ. 414 కోట్లతో పోలిస్తే ఇది 0.9 శాతం ఎక్కువ.


Q4 ఫలితాలు ప్రకటించిన మరికొన్ని కంపెనీలు: స్టెర్లింగ్ అండ్‌ విల్సన్ రెన్యూవబుల్, భన్సాలీ ఇంజినీరింగ్ పాలిమర్స్, HDFC AMC, ఇరెడా, అమల్, బెనారస్ హోటల్స్. ఈ కంపెనీల రిజల్ట్స్‌ను బట్టి ఈ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు స్పందిస్తారు.


అల్ట్రాటెక్ సిమెంట్: ఇండియా సిమెంట్స్ నుంచి సంవత్సరానికి 1.1 మిలియన్ టన్నుల (mtpa) సామర్థ్యం గల గ్రైండింగ్ యూనిట్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ ఫ్లాంట్‌ మహారాష్ట్రలో ఉంది, డీల్‌ విలువ రూ.315 కోట్లు. 


టాటా గ్రూప్ స్టాక్స్‌: మన దేశంలో పెగాట్రాన్ కార్పొరేషన్ ఐఫోన్ తయారీ కార్యకలాపాలను చేజిక్కించుకోవడానికి టాటా గ్రూప్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ గ్రూప్‌ స్టాక్స్‌ ఈ రోజు ఫోకస్‌లో ఉంటాయి.


NTPC: జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో NTPC నార్త్ కరణ్‌పురా సూపర్‌థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మరోవైపు.. ఈ కంపెనీ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ - ఇండస్ టవర్స్ గ్రీన్ ఎనర్జీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.


టాటా స్టీల్: అంగుల్ ఎనర్జీని విలీనం చేసుకోవడానికి NCLT నుంచి ఆమోదం లభించింది.


లారస్ ల్యాబ్స్: ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడ, అనకాపల్లిలోని API తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసిన USFDA ఒక్క అబ్జర్వేషన్ కూడా జారీ చేయలేదని లారస్ ల్యాబ్స్ తెలిపింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: అంచనాలను మించిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు - ఖజానాకు కాసుల కళ