Direct Tax Collections For FY24: 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరిగాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (FY24), మన దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Net Direct Tax Collections) రూ. 19.58 లక్షల కోట్లకు చేరాయి. వార్షిక ప్రాతిపదికన (2022-23 ఆర్థిక సంవత్సరం కంటే) 17.70 శాతం ఇవి పెరిగాయి. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌లో (FY23) ఈ మొత్తం రూ. 16.64 లక్షల కోట్లుగా ఉంది.
కేంద్ర బడ్జెట్ సమయంలో (Budget Estimates - BE), 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 18.23 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను అంచనా వేశారు. తర్వాత దానిని రూ. 19.45 లక్షల కోట్లకు (Revised Estimates - RE) సవరించారు. అయితే, ఆదివారం విడుదల చేసిన గణాంకాలు ఈ అంచనాను కూడా కూడా దాటాయి. రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కంటే దాదాపు రూ. 13 వేల కోట్లు ఎక్కువగా భారత ప్రభుత్వ ఖజానాలోకి చేరాయి. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఏకంగా 1.35 లక్షల కోట్లు ఎక్కువగా వసూలయ్యాయి. ఇది 7.40 శాతం వృద్ధి.
మరో ఆసక్తికర కథనం: హెల్త్ ఇన్సూరెన్స్ అమలులో కీలక మార్పులు, ఇకపై వారికి సైతం ఆరోగ్య బీమా
పెరిగిన కార్పొరేట్ పన్ను వసూళ్లు
FY24లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Gross Direct Tax Collections) రూ. 23.37 లక్షల కోట్లుగా ఉన్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (Central Board of Direct Taxes - CBDT) వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 18.48 శాతం తగ్గి రూ. 19.72 లక్షల కోట్లకు పరిమితమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు (Gross Corporate Tax Collections) 13.06 శాతం పెరిగి రూ. 11.32 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 10 లక్షల కోట్లు. CBDT గణాంకాల ప్రకారం, నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు కూడా FY23 కంటే FY24లో 10.26 శాతం పెరిగి రూ. 9.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ. 8.26 లక్షల కోట్లుగా ఉంది.
3.79 లక్షల కోట్ల విలువైన రిఫండ్స్
గత ఆర్థిక సంవత్సరంలో స్థూల వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు (Gross Individual Income Tax Collections) 24.26 శాతం పెరిగి రూ. 12.01 లక్షల కోట్లకు చేరాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ. 9.67 లక్షల కోట్లు. నికర వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (Net Individual Income Tax Collections) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 25.23 శాతం పెరిగి రూ. 10.44 లక్షల కోట్లను అధిగమించాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 8.33 లక్షల కోట్లుగా ఉంది. CBDT లెక్కల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.79 లక్షల కోట్ల విలువైన రిఫండ్స్ (Refunds) జారీ అయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని రూ. 3.09 లక్షల కోట్ల రిఫండ్స్‌తో పోలిస్తే గత ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇవి 22.74 శాతం పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: నేటి బంగారం, వెండి ధరలు ఇవే - దుబాయ్‌లో బాగా చౌక, ధర ఎంతంటే?