Stock Market Today, 09 April 2024: ఆసియా మార్కెట్ల నుంచి గ్రీన్‌ సిగ్నల్స్‌ రావడంతో ఈ రోజు (మంగళవారం) కూడా ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ ఈక్విటీలు రికార్డ్‌ స్థాయిలో ప్రారంభం కావచ్చు, మొమెంటం కొనసాగించవచ్చు.


ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,840 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌ అప్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ఈ ఉదయం హయ్యర్‌ సైడ్‌లో ఉన్నాయి. జపాన్‌లోని నికాయ్‌ 0.52 శాతం లాభపడగా, బ్రాడ్-బేస్డ్ టోపిక్స్ 0.35 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాలో, S&P/ASX 200 0.36 శాతం స్వల్ప పెరుగుదలతో ట్రేడ్‌ ప్రారంభించింది. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్ ఇండెక్స్ 1.59 శాతం లాభాల్లో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.76 శాతం ఎగబాకగా, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 0.22 శాతం పెరిగింది.


అమెరికన్‌ మార్కెట్లలో, సోమవారం, డౌ జోన్స్‌ & నాస్‌డాక్ దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.03 శాతం, S&P 500 0.04 శాతం తగ్గాయి. నాస్‌డాక్ కాంపోజిట్ 0.03 శాతం పెరిగింది. బుధవారం వెలువడనున్న కీలక ద్రవ్యోల్బణం డేటా కోసం పెట్టుబడిదార్లు ఎదురు చూస్తున్నారు. 


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ కాస్త తగ్గి 4.41 శాతానికి దిగి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ మళ్లీ $90 పైకి చేరింది. గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్‌ స్థాయిలో కొనసాగుతోంది, ఔన్సుకు $2,361 దగ్గర ఉంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


యాక్సిస్ బ్యాంక్: ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్‌ బైన్ క్యాపిటల్, ఈ రోజు, బ్లాక్ డీల్ ద్వారా యాక్సిస్ బ్యాంక్‌లో తన మిగిలిన వాటాను అమ్మబోతోంది. ఒక్కో షేర్‌ను రూ. 1,071 - రూ. 1,076 పరిధిలో విక్రయిస్తుంది.


టాటా మోటార్స్: జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమ్మకాలు Q4లో 11 శాతం పెరిగి 114,038 యూనిట్లకు చేరుకున్నాయి. పెరిగిన ఉత్పత్తి, ప్రపంచ డిమాండ్ వల్ల ఇది సాధ్యమైంది. మొత్తంలో FY24లో అమ్మకాలు 22 శాతం పెరిగి 4,31,733 యూనిట్లకు చేరుకున్నాయి.


రిలయన్స్ (RIL): కంపెనీ టెలికాం విభాగం రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ట్రాయ్ తాజా సమాచారం ప్రకారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.59 మిలియన్ల కొత్త యూజర్లను చేర్చుకుంది, తద్వారా మార్కెట్ వాటాలో 40% వాటాను కైవసం చేసుకుంది.


వాహన సంస్థలు: ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ప్రకారం, రెపో రేటును మార్చకుండా RBI తీసుకున్న నిర్ణయం వల్ల వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.


యెస్ బ్యాంక్: 2022 డిసెంబర్‌లో NPA పోర్ట్‌ఫోలియోను JC ఫ్లవర్ ARCకి విక్రయించిన తర్వాత, దాని సెక్యూరిటీ రిసిప్ట్స్‌ పోర్ట్‌ఫోలియోలోకి రూ. 244 కోట్లు వచ్చాయి.


ముత్తూట్ మైక్రోఫిన్: ఈ మైక్రోఫైనాన్స్ సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) Q4లో 32 శాతం పెరిగి రూ. 12,194 కోట్లకు చేరాయి.


దిలీప్ బిల్డ్‌కాన్: హరియాణా రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ. 1,092 కోట్ల విలువైన ఆర్డర్‌ను గెలుచుకుంది.


క్యుపిడ్‌: నాలుగో త్రైమాసికం నికర లాభం సంవత్సర ప్రాతిపదికన 185 శాతం పెరిగి రూ. 23.70 కోట్లకు చేరుకుంది; ఆదాయం 51.5 శాతం పెరిగి రూ.62.90 కోట్లకు చేరుకుంది.


CG పవర్: FY19లో, తప్పుడు మార్గంలో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ పొందారని ఆరోపిస్తూ భోపాల్ GST, ఎక్సైజ్ అధికారులు ఈ కంపెనీకి రూ.4.1 కోట్ల టాక్స్‌ నోటీస్‌ పంపారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రికార్డ్‌ స్థాయిలో పసిడి సెగ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి