Stock Market Today, 06 May 2024: గ్లోబల్‌ మార్కెట్ల ఇస్తున్న సిగ్నల్స్‌ ఆధారంగా ఈ రోజు (సోమవారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు కూడా మంచి ఓపెనింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది.


శుక్రవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,475 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,680 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌లో ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, ఈ ఉదయం.. హాంగ్‌కాంగ్‌లోని హ్యాంగ్‌ సెంగ్ 0.11 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 ఇండెక్స్‌ 0.59 శాతం లాభపడింది. జపాన్‌కు చెందిన నికాయ్‌, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి ఈ రోజు సెలవు తీసుకున్నాయి.


US నాన్‌ఫార్మ్ పేరోల్స్ డేటా తర్వాత, శుక్రవారం, అమెరికన్‌ మార్కెట్లు సానుకూలంగా క్లోజ్‌ అయ్యాయి. నాస్‌డాక్ 1.99 శాతం లాభంతో ముగిస్తే, S&P 500 ఇండెక్స్‌ 1.26 శాతం పెరిగింది. డౌ జోన్స్‌ కూడా 1.26 శాతం విలువను పెంచుకుంది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.5% కంటే స్వల్పంగా దిగువకు చేరింది, 4.498% వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా తగ్గాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83 వద్దకు చేరింది. యూఎస్‌లో జాబ్‌ డేటా అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేపట్టడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఔన్సుకు $2,322 డాలర్లకు పెరిగింది.
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


బిర్లాకార్ప్: 2024 మార్చి త్రైమాసికంలో (Q4 FY24) కంపెనీ లాభం అతి భారీగా 127 శాతం పెరిగి రూ. 193 కోట్లకు చేరుకుంది. అదే కాలంలో ఆదాయం దాదాపు 7 శాతం పెరిగి రూ. 2,682 కోట్లు నమోదైంది.


డీమార్ట్స్‌: Q4 FY24లో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లాభం గత సంవత్సరం కంటే (YoY) 22 శాతం పెరిగి రూ. 563 కోట్లకు చేరుకుంది, ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది రూ. 460 కోట్లుగా ఉంది.


కోటక్ మహీంద్రా బ్యాంక్: మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ పన్ను తర్వాత లాభం (PAT) రూ.13,782 కోట్లకు పెరిగింది, FY23లో ఇది రూ.10,939 కోట్లుగా ఉంది. సంవత్సరంలో 26 శాతం పెరిగింది.


కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్: 2024 మార్చి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.96.24 కోట్ల YoY నుంచి 18.76 శాతం వృద్ధితో రూ.114.29 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా 3.36 శాతం వృద్ధితో రూ. 1,743.29 కోట్ల నుంచి రూ. 1,801.92 కోట్లకు చేరుకుంది,


J&K బ్యాంక్: Q4లో బ్యాంక్‌ రికార్డ్‌ స్థాయి వార్షిక లాభాన్ని ఆర్జించింది, రూ. 1,767 కోట్లను మిగుల్చుకుంది. నికర లాభం FY23 కంటే FY24లో 48 శాతం పెరిగింది.


పేటీఎం: కంపెనీ COO & ప్రెసిడెంట్‌గా భవేష్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు.


టాటా పవర్: 460 మెగావాట్ల ఫర్మ్ అండ్ డిస్పాచ్బుల్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌జేవీఎన్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 


సన్ ఫార్మా: వాల్‌స్టార్ S.A. నుంచి 100 శాతం షేర్లను 31 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు డీల్‌ ఓకే అయింది. 


జైడస్ లైఫ్‌సైన్సెస్: హచిన్సన్-గిల్ఫోర్డ్ ప్రొజెరియా సిండ్రోమ్ చికిత్సలో ఉపయోగించే జోకిన్వీ కోసం జైడస్ లైఫ్ సైన్సెస్ విభాగం సెంటిన్ల్ థెరప్యూటిక్స్‌ యాజమాన్య హక్కులు దక్కించుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి