MI vs SRH IPL 2024 Head to head records : ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) ముంబై(MI) జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. హైదరాబాద్‌ ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతుండగా ముంబై పరువు దక్కించుకోవాలని చూస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ హైదరాబాద్, ముంబై జట్లు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. హైదరాబాద్‌ తొమ్మిది మ్యాచుల్లో గెలిచింది. 2020 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి ముంబైపై హైదరాబాద్‌ కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.


పిచ్‌ ఎలా ఉంటుందంటే..?
ముంబైలోని వాంఖడే పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌండరీలు చిన్నవిగా ఉండడంతో భారీ స్కోర్లు నమోదవుతూ ఉంటాయి. వాంఖడే  పిచ్ సాధారణంగా ఫ్లాట్‌గా బౌన్సీగా ఉంటుంది. బ్యాటర్‌లు తమ షాట్‌లను కొట్టడం సులభం అవుతుంది.ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ గేమ్‌లో టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది.


బ్యాటర్లు రాణిస్తే...
అయిదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. ఈ మ్యాచ్‌లో పరువు కోసం పాకులాడుతోంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, డెవాల్డ్ బ్రెవిస్, రోహిత్ శర్మ, కిషన్‌ ఉన్నా గెలుపు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ ఆకట్టుకోలేక పోయాడు. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. స్పిన్నర్లు షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా నుంచి హార్దిక్ మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నాడు. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు మంచి ఆటతీరు ప్రదర్శిస్తోంది. 


గత మ్యాచ్‌లో ఇలా..
ఐపీఎల్‌(IPL 2024)లో ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)-ముంబై ఇండియన్స్‌(MI) మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు వైపుల బ్యాటర్లు చెలరేగడంతో ఉప్పల్‌ బౌండరీలతో మోత మోగింది. బ్యాటర్ల రన్‌ రంగం ముందు బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 భారీ స్కోర్‌ చేసింది. ఆరంభం నుంచే ఆ జట్టు బ్యాటర్లు.. దూకుడుగా ఆడారు. క్లాసెన్‌ 80,అభిషేక్‌ శర్మ 63, ట్రావిస్‌ హెడ్‌ 62, మార్‌క్రమ్‌ 42 వీరవిహారం చేశారు. భారీ లక్ష్య ఛేధనలో ముంబయి కూడా ధీటుగా బదులిచ్చినా... నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. ముంబయి బ్యాటర్లలో తిలక్ వర్మ 64, టిమ్‌ డేవిడ్‌ 42, నమన్‌ ధీర్‌ 30 పరుగులు చేశారు. ప్యాట్‌ కమిన్స్‌, జయదేవ్‌ ఉనద్కట్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయి.