MI vs SRH IPL 2024 Preview and Prediction : ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆత్మ విశ్వాసంతో ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH).. ఈ సీజన్‌లో బలహీనంగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్(MI)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని హైదరాబాద్ చూస్తుండగా....పరువు కోసం ముంబై పాకులాడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 పాయింట్ల పట్టికలో మొత్తం పది మ్యాచుల్లో ఆరు విజయాలు... నాలుగు పరాజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిస్తే ఆత్మవిశ్వాసం లోపించిన ముంబైపై విజయం కష్టమేమీ కాదు. ప్లే ఆఫ్‌కు ముందు జరుగుతున్న కీలక మ్యాచుల్లో రాణించాలని హైదరాబాద్ బౌలర్లు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు.
పాయింట్ల పట్టికలో హోరాహోరీ
ఐపీఎల్‌లో ఈ సీజన్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లు, లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నాలుగో స్థానంలో హైదరాబాద్ ఉంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ కీలకం కావడంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని ప్యాట్ కమిన్స్ సేన గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్లు జోరు మీద ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగులు సాధించారు. మరోసారి హైదరాబాద్ బ్యాటర్లు జోరు అందుకుంటే ముంబై ఇండియన్స్‌కు కష్టాలు తప్పవు. వాంఖడే స్టేడియంలో పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మరోసారి హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వాంఖడేలో బౌండరీలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200కంటే ఎక్కువ పరుగులే చేస్తుంది.
హైదరాబాద్ గత మ్యాచ్‌లో కేవలం ఒక పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ఈ విజయం హైదరాబాద్ ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ఈ మ్యాచ్లో బౌలర్లు హైదరాబాద్‌కు విజయాన్ని అందించడం విశేషం. హైదరాబాద్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (396 పరుగులు), అభిషేక్ శర్మ (315), హెన్రిచ్ క్లాసెన్ (337) పరుగులతో మంచి ఫామ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. నితీష్ కుమార్ రెడ్డి 219 పరుగులతో పర్వాలేదనిపిస్తున్నాడు.ఈ కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్‌లో నటరాజన్ ఇప్పటికే 15 వికెట్లు తీసి రాణిస్తున్నాడు.
అట్టడుగున ముంబై
పాయింట్ల పట్టికలో అట్టడుగున ముంబైకు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ముంబై చూస్తోంది. 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన ముంబై ప్లే ఆఫ్‌కు దాదాపుగా దూరమైంది. రాబోయే T20 ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అవసరం. ఈ మ్యాచ్‌లో అయినా పాండ్యా రాణిస్తాడేమో చూడాలి. కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సూర్యకుమార్ కోల్‌కత్తాపై మంచి అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు.
జట్లు
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .