Stock Market Today, 05 March 2024: ప్రపంచ మార్కెట్లలో బలహీనతలు, ఈ రోజు (మంగళవారం), ఇండియన్‌ బెంచ్‌మార్క్ సూచీల మీద పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.


ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 31 పాయింట్లు లేదా 0.14 శాతం రెడ్‌ కలర్‌లో 22,488 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
2024 సంవత్సరానికి దాదాపు 5 శాతం ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని చైనా నిర్దేశించుకుంది. ఇది అంచనాలకు తగ్గట్లుగానే ఉండడం, ఆశ్చర్యకరమైన నిర్ణయాలు లేకపోవడంతో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు లోయర్‌ సైడ్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేలా డ్రాగన్‌ గవర్నమెంట్‌ నుంచి మరిన్ని పాలసీ నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఆసియా మార్కెట్లలో.. నికాయ్‌, హ్యాంగ్ సెంగ్ వరుసగా 0.9 శాతం వరకు పడిపోయాయి. కోస్పి 0.17 శాతం పతనమైంది. 


USలో, నిన్న, S&P 500 0.12 శాతం తగ్గింది, నాస్‌డాక్ 0.41 శాతం క్షీణించింది. డౌ జోన్స్ 0.25 శాతం నష్టపోయింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


న్యూ లిస్టింగ్స్‌: ఎక్సికామ్ టెలీ సిస్టమ్స్ (Exicom Tele Systems), ప్లాటినమ్ ఇండస్ట్రీస్ (Platinum Industries) ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి. IPO సమయంలో ఈ రెండు కంపెనీలు వరుసగా రూ. 142 & రూ. 171 ధరకు ఒక్కో షేర్‌ను జారీ చేశాయి.


టాటా మోటార్స్: టాటా మోటార్స్ లిమిటెడ్, తన వ్యాపారాన్ని విడదీసి & రెండు విభిన్న కంపెనీలుగా లిస్ట్‌ చేసేందుకు డైరెక్టర్ల బోర్డ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రయాణీకుల వాహనాలు, వాణిజ్య వాహనాల విభాగాలను వేర్వేరు కంపెనీలుగా డీమెర్జ్‌ చేస్తుంది.


M&M: కేంద్ర ప్రభుత్వ పథకం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) కార్యక్రమం కింద మరో విడత ప్రోత్సాహకాలను అందుకోవడానికి మహీంద్ర & మహీంద్ర సిద్ధంగా ఉంది.


IIFL ఫైనాన్స్: కొత్తగా బంగారు రుణాలను మంజూరు చేయకుండా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), సోమవారం, IIFL ఫైనాన్స్ మీద నిషేధం విధించింది. ఆ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది.


మాక్రోటెక్ డెవలపర్స్‌: రూ.3,300 కోట్లను సమీకరించేందుకు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్‌ను (QIP) ఈ కంపెనీ ప్రారంభించింది.


NTPC: ఈ కంపెనీ విభాగమైన NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఉత్తరప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్‌ పార్కులు, ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి 'ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పదన్ నిగమ్ లిమిటెడ్‌'తో జాయింట్ వెంచర్‌ ఏర్పాటు చేస్తోంది.


AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ - ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం లభించింది, ఏప్రిల్ 1, 2024 నుంచి ఇది అమలవుతుంది. దీని ద్వారా రూ. 1.16 లక్షల కోట్లకు పైగా బ్యాలెన్స్ షీట్‌ను కొత్త కంపెనీకి ఉంటుంది.


గోద్రెజ్ ఆగ్రోవెట్: గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ ప్రమోటర్లు ఈ కంపెనీలో కొంత వాటాను విక్రయించడానికి ప్రైవేట్ ఈక్విటీ (PE) కంపెనీలు సహా వివిధ పెట్టుబడిదార్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


బయోకాన్ బయోలాజిక్స్: బయోకాన్ అనుబంధ సంస్థ అయిన బయోకాన్ బయోలాజిక్స్, సోమవారం, బేయర్ & రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్‌తో ఒక ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం, కెనడియన్ మార్కెట్‌లో EYLEA (aflibercept) ఇంజెక్షన్‌కు ప్రతిపాదిత బయోసిమిలర్ అయిన Yesafili ను బయోకాన్ బయోలాజిక్స్‌ విడుదల చేస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.