Congress vs BJP: వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో (Lok Sabha Elections 2024) విజ‌యం ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని `ఇండి యా`(I.N.D.I.A) కూటమి తాజాగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల శంఖం పూరించింది. అయితే.. మ‌రోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ దూకుడు మామూలుగా లేదు. ఒక‌వైపు అభివృద్ధి, మ‌రోవైపు సంక్షేమం.. ఇంకోవైపు అంత‌ర్జాతీయంగా పేరు ప్ర‌ఖ్యాతులు వెర‌సి బీజేపీ(BJP) ప‌దేళ్ల సుదీర్ఘ పాల‌న త‌ర్వాత కూడా రేసు గుర్రాన్నే త‌ల‌పిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఎక్క‌డా విసుగు, విరామం లేకుండా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ( Narendra Modi), కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా(Amit Shah) వంటివారు పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. 


ఉత్త‌రాది నుంచి.. ద‌క్షిణాది వ‌ర‌కు.. 


ఉత్త‌రాది నుంచి ద‌క్షిణాది వ‌ర‌కు.. ఈశాన్యం నుంచి ప‌శ్చిమం వ‌ర‌కు.. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండా ఎగిరేలా ప‌క్కా ప్ర‌ణాళికా యుతంగా ముందుకు సాగుతున్నారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని భావించిన ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును సైతం క‌మ‌ల నాథులు ఒడిసి పట్టుకుం టున్నారు. అదేస‌మ‌యంలో స‌మాజంలోని మేధావులు, వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారిని త‌మ‌వైపు లౌక్యంగా తిప్పుకొంటున్నారు. ఇలాంటి ఉత్తేజంతో ముందుకు సాగుతున్న బీజేపీని అడ్డుకుని అధికారం ద‌క్కించుకోవ‌డం.. కాంగ్రెస్ పార్టీకి సాధ్య‌మేనా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అదేస‌మ‌యంలో మ‌రోవైపు కాంగ్రెస్ లో అంత‌ర్గ‌త కుమ్ములాటలు పెరుగుతున్నాయి. 


టికెట్ల చిచ్చు.. 


పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించిన టికెట్ల పందేరంలో తెర‌మీదికి వ‌స్తున్న ర‌చ్చ పార్టీకి అశ‌నిపాతంగా మారింది. దీంతో కాంగ్రెస్ పుంజుకోవ‌డం ఎలా ఉన్నా.. పార్టీని నిల‌బెట్టుకునే ప‌రిస్థితి ప్ర‌శ్న‌ల మ‌యంగా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్.. బీజేపీవైపు చూస్తున్నారనే తెలిసిందే. ఈ విష‌యంలో కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను బుజ్జ‌గించింది లేదు. పైగా, పోతే పోనీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక‌, క‌ర్ణాట‌క‌లో క‌లిసి వ‌చ్చే పార్టీలు లేకుండా పోవ‌డంతోపాటు.. బీజేపీతో కుమార‌స్వామి పార్టీ జేడీఎస్ చెలిమి చేయడం పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ద‌క్షిణ క‌ర్ణాట‌క‌లోని 14 స్థానాల‌పై  ప్ర‌భావం చూపిస్తుంద‌నే వాద‌న వినిపిస్తోంది. త‌మిళ‌నాడులోనూ పొత్తుల మ‌ధ్య చికాకులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. పైకి కాంగ్రెస్‌తో క‌లిసి ఉన్నామ‌ని సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే చెబు తున్నా.. మొత్తం 39 పార్ల‌మెంటు స్థానాల్లోకేవ‌లం ఒక‌టి లేదా రెండు మాత్ర‌మే సీట్లు పంచుకునేందుకు సిద్ధ‌ప‌డుతుండ‌డం కాంగ్రెస్‌కు త‌ల‌కొట్టేసినంత ప‌నిగా ఉంది.  ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌, యూపీ, బిహార్‌ల‌లో పైచేయి మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ ప‌రిస్థితి మోచేతిని త‌ల‌పిస్తోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. 


సో.. సోగా జోడో


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వ‌హిస్తున్న భార‌త్ జోడో న్యాయ యాత్ర కూడా సో.. సో.. అన్న‌ట్టుగానే సాగుతోంది. ఆదిలో ఉన్నంత ఊపు, ప్ర‌చారం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అదేస‌మ‌యంలో రాహుల్ చేస్తున్న ప్ర‌సంగాల్లోనూ ప‌స త‌గ్గి న‌స పెరిగింద‌నే వాద‌న కూడా ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తోంది. ప్ర‌ధాని మోడీపై విరుచుకుప‌డేందుకే జోడో యాత్ర‌లు నిర్వ‌హిస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి తోడు దేశాన్ని పాకిస్థాన్‌తో పోల్చుతూ.. చేసిన విమ‌ర్శ‌లు కూడా రాహుల్‌కు బూమ‌రాంగ్ అయ్యాయి. ఇక‌, నిరుద్యోగం, మోడీ కేంద్రంగా ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లే చేస్తున్నారు. చెప్పిన విష‌యాల‌నే ప‌దే ప‌దే చెబుతున్నారు. దీంతో జోడో న్యాయ యాత్ర‌కు తొలి ద‌శలో  ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. 


బీజేపీ వ్యూహాలు.. 


కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా ఉంటే.. బీజేపీ ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతోంది. త‌న‌తో క‌లిసి వ‌చ్చే పార్టీ ల కోసం.. బీజేపీ ఎదురు చూడ‌డం లేదు. బీజేపీ కోస‌మే ఎదురు చూసే ప‌రిస్థితిని ఆ పార్టీ తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. పైగా ఒక‌వైపు మోడీ, మ‌రోవైపు అమిత్‌షాలు నిల‌బ‌డి.. బీజేపీ ప్ర‌చార ర‌థాన్ని ఉవ్వెత్తున ముందుకు సాగేలా చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లిస్తున్నాయి. వెర‌సి బీజేపీ దూకుడును చేరుకుని, దానికి మించిన స్థాయిలో కాంగ్రెస్ పుంజుకోవాలంటే ఇప్పుడున్న శ్ర‌మ ఏమాత్రం స‌రిపోద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రింత వ్యూహాత్మ‌కంగా.. మ‌రిన్ని ల‌క్ష్యాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి ఏం చేస్తారో చూడాలి.