Nama Nageswara Rao, Maloth Kavitha on MP election: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) వరుస సమీక్షలు నిర్వహిస్తూ... ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఖమ్మం బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao), మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత (Maloth Kavitha)ను ఖరారు చేశారు. ఇవాళ... ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో భేటీ అయిన.. బీఆర్‌ఎస్ అధినేత లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలందరి అభిప్రాయాలు తీసుకుని... ఖమ్మం బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాలోతు కవిత పేర్లను ప్రకటించారు. లోకసభ ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశం కల్పించింనందుకు... పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల సమావేశంలో పార్టీ నేతలు ఏకగ్రీవంగా తన పేరును, మాలోతు కవిత పేరు ప్రపోజ్ చేసినట్టు చెప్పారు నామా నాగేశ్వరరావు. తమకు ప్రజల మద్దతు ఉందన్నారు నామా నాగేశ్వరరావు. కేసీఆర్ హయాంలోనే... తాగు, సాగు నీరుకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ... లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తమకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు నామా నాగేశ్వరరావు. పాతికేళ్లుగా ప్రజాసేవలోనే ఉన్నామని చెప్పారాయన. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీతోపాటు ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటామని చెప్పారాయన. గెలుపోటములు కాదు.. ప్రజాసేవ ముఖ్యమని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక... మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత కూడా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ... మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు మాలోతు కవిత. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా తాము పోరాడామన్నారు. బీఆర్‌ఎస్ పోరాటం వల్ల, కేంద్రంపై తమ ఎంపీలు ఒత్తిడి పెంచడం వల్లే... ములుగులో గిరిజన యూనివర్సిటీ వచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పుచేశామన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందని అన్నారామె. కరెంటు, నీళ్ల ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారని చెప్పారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపేయడం వల్ల... పొలాలు ఎండిపోతున్నాయని రైతులు చెప్తున్నారన్నారు. అలాగే.. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోవడాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కొన్ని హామీలను మాత్రమే అమలు చేస్తూ... మిగిలిన వాటిని మరుగున పడేస్తున్నారన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు మాలోతు కవిత. మహిళలకు నెలకు 2వేల 500 రూపాయల నగుదు, రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ, పింఛన్ పెంపుతోపాటు చాలా హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజల్లోనే ఎండగడతామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు.. బీఆర్‌ఎస్ వెంటనే ఉంటారని అన్నారామె. మహబూబాబాద్ సెగ్మెంట్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమాగా చెప్పారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనారోగ్యం కారణంగానే సమావేశానికి రాలేదన్నారు మాలోతు కవిత. కాంగ్రెస్‌లో ఆయనకు అవకాశం రాలేదని.. బీఆర్‌ఎస్‌లో ఉన్నారు కనుకే ఆయన ఎమ్మెల్యే అయ్యారని చెప్పారు. తెల్లం వెంకట్రావు పార్టీ మారబోరని చెప్పారు. ములుగు నుంచి భద్రాచలం వరకు ఏడు నియోజకవర్గాల ప్రజలు తనను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు మాలోతు కవిత.