Revanth Reddy Will Attend Congress Nyaya Sadhana Sabha In Visakha : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ జోరు పెంచింది. వరుస సభలు, సమావేశాలతో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కీలక నాయకులతో సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. మరో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 13 తేదీల మధ్య విశాఖపట్నంలో న్యాయ సాధన పేరుతో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సభకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌రెడ్డి సోమవారం సాయంత్రం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.


విశాఖలో నిర్వహిస్తున్న న్యాయ సాధన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తదితరులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ సభలో కీలక అంశాలపై తీర్మానాలు చేయనున్నట్టు వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం, రైల్వే జోన్‌ సంబంధించిన మరో తీర్మానం చేయనున్నట్టు రాకేష్‌ రెడ్డి తెలిపారు. సభా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే రీతిలో ముఖ్య అతిథుల ప్రసంగాలు ఉంటాయని ఆయన వివరించారు. 


ఎన్నికలకు కేడర్‌ను సన్నద్ధం చేస్తూ.. 
గడిచిన కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ స్తబ్ధుగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీలోకి షర్మిల వచ్చిన తరువాత కేడర్‌లో ఉత్సాహం పెరిగింది. పార్టీ నుంచి పోటీ చేసే ఆశావహుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇదే ఉత్సాహాన్ని వచ్చే ఎన్నికల వరకు కొనసాగించాలని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే సభలు నిర్వహిస్తుండగా, మరో పక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క బలమైన అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో బరిలో దించేందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి బలమైన శక్తిగా ఎదగడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకుంది. ఇందుకు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను షర్మిలకు ఏఐసీసీ అందిస్తోంది. పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి సహకారాన్ని తీసుకునేలా ఆదేశాలు ఉన్నాయి. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. 


రేవంత్‌ హాజరుతో సభపై ఫోకస్‌ 
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీలో నిర్వహిస్తున్న తొలి కాంగ్రెస్‌ సభకు హాజరుకానున్నారు. దీంతో ఈ సభపై రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి పడనుంది. ఇప్పటి వరకు షర్మిల చేస్తున్న విమర్శలు అధికార వైసీపీకి ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి ఏపీలోని కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న సభకు హాజరుకావడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సభలో ఆయన ఏం మాట్లాడతారు, సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనపై ఎటువంటి విమర్శలు చేస్తారన్న దానిపైనా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరయ్యే దాన్ని బట్టి మూడు రోజుల్లో ఏదో ఒక తేదీని ఖరారు చేసేలా ఏపీసీసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే షర్మిల వెళ్లి రేవంత్‌ రెడ్డితో చర్చించారు. మరోసారి కూడా వెళ్లి ఆమె రేవంత్‌కు ఆహ్వానం పలికే అవకాశముందని చెబుతున్నారు.