Stock Market Today, 02 March 2024: ఇండియన్‌ స్టాక్‌ స్టాక్‌ మార్కెట్లలో ఈ రోజు (శనివారం) ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లుగా జరిగే స్పెషల్‌ ట్రేడింగ్‌లో.. మొదటి సెషన్‌ను ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు, రెండో ట్రేడింగ్ సెషన్‌ను ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఊహించని సంఘటనలను ఎదుర్కొనేందుకు మార్కెట్ల సంసిద్ధతను పరీక్షించడానికి, ఈ రోజు డిజాస్టర్ రికవరీ సైట్‌లో (DRS) ట్రేడింగ్‌ జరుగుతుంది.


ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 60 పాయింట్లు లేదా 0.23 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,511 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు శుక్రవారం సానుకూలంగా ముగియడంతో, ఆ ఉత్సాహకర పవనాలు ఇండియన్‌ మార్కెట్లను ఉల్లాసపరిచే అవకాశం ఉంది. దీంతో, శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు శుక్రవారం నాటి లాభాలను పొడిగించే అవకాశం ఉంది. నిన్న, BSE సెన్సెక్స్ 73,819 పాయింట్లు, NSE నిఫ్టీ 22,353 పాయింట్ల రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 1245 పాయింట్ల జంప్‌తో 73,745 వద్ద, NSE నిఫ్టీ 356 పాయింట్ల జంప్‌తో 22,338 వద్ద క్లోజయ్యాయి.


గ్లోబల్‌ మార్కెట్లు
నిన్న US మార్కెట్లు పూర్తి పచ్చగా ఉన్నాయి. 2024 జనవరిలో US మాన్యుఫాక్చరింగ్‌ PMI వృద్ధి 49.1 శాతం నుంచి 47.1 శాతానికి తగ్గినప్పటికీ, S&P 500, నాస్‌డాక్ తాజా రికార్డు స్థాయిలను తాకాయి. PMI డేటా 50-మార్క్ కంటే తక్కువగా ఉండటం ఇది వరుసగా 16వ నెల. బలహీన ఆర్థిక గణాంకాల వల్ల, ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు పెరిగాయి. అందుకే అమెరికన్‌ మార్కెట్లు ర్యాలీ చేశాయి. డౌ జోన్స్ 0.2 శాతం లాభపడగా, S&P 500, నాస్‌డాక్ వరుసగా 0.8 శాతం మరియు 1.1 శాతం జంప్ చేశాయి.


US 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్ రాబడి 4.186 శాతానికి పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు దాదాపు 2 శాతం పెరిగి 83.46కు చేరుకుంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


మినరల్ బ్లాక్‌ల వేలం: వేదాంత, కోల్ ఇండియా, NLC ఇండియా, ఓలా ఎలక్ట్రిక్, జిందాల్ పవర్, దాల్మియా గ్రూప్, శ్రీ సిమెంట్‌ కీలక ఖనిజ బ్లాకుల వేలం కోసం బిడ్లు వేశాయి.


గ్రీన్ హైడ్రోజన్: నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (NGHM) కింద ఎలక్ట్రోలైజర్ తయారీలో తొలి టెండర్ కోసం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), అదానీ ఎంటర్‌ప్రైజెస్, L&T వంటి బిడ్డర్లను కేంద్రం ఖరారు చేసింది.


యాక్సిస్ బ్యాంక్: ఎన్‌సీడీల ద్వారా రూ.4,000 కోట్ల వరకు సమీకరించనుంది. ప్రాథమిక జారీ విలువ రూ. 1,000 కోట్లు, గ్రీన్ షూ ఆప్షన్‌ రూ. 3,000 కోట్లు.


ఇన్ఫో-ఎడ్జ్, మ్యాట్రిమోనీ: ఇన్ఫో ఎడ్జ్‌కు చెందిన జాబ్ సెర్చ్ ఫ్లాట్‌ఫామ్‌ నౌక్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారం 99 ఏకర్స్‌, మాట్రిమోనికి చెందిన భారత్‌ మాట్రిమోని యాప్స్‌ను 'యాప్ స్టోర్' నుంచి గూగుల్‌ తొలిగించింది. సర్వీస్ ఫీజు చెల్లించనందుకు ఈ నిర్ణయం తీసుకుంది.


టొరెంట్ పవర్: గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సరఫరా కోసం ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ నుంచి రూ.440 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకుంది.


పేటీఎం: మనీలాండరింగ్ రూల్స్‌ పాటించనందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది.


అరబిందో ఫార్మా: ఫింగోలిమోడ్ క్యాప్సూల్స్ 0.5 mg మార్కెటింగ్ కోసం US FDA ఆమోదం పొందింది. మల్టిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు.


హీరో మోటోకార్ప్‌: ఫిబ్రవరిలో 19 శాతం YOY సేల్స్‌ గ్రోత్‌తో 4,68,410 యూనిట్లను అమ్మింది. దేశీయ విక్రయాలు 16.5 శాతం వృద్ధితో 4,45,257 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 91 శాతం పెరిగి 23,153 యూనిట్లకు చేరుకున్నాయి.


వెల్‌స్పన్‌ కార్ప్‌: ఈ కంపెనీ స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ సింటెక్స్‌ అడ్వాన్స్ ప్లాస్టిక్స్ (SAPL), రూ.400 కోట్ల పెట్టుబడితో మధ్యప్రదేశ్‌లో ప్లాస్టిక్ పైపులు & నీటి నిల్వ ట్యాంకుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్లలో స్పెషల్‌ ట్రేడింగ్‌, దీనికో ప్రత్యేక కారణం ఉంది