Special Trading Session Today On 2nd March 2024: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లలో ఈ రోజు ‍‌(శనివారం, 02 మార్చి 2024) పని చేస్తాయి. సాధారణంగా, శనివారం 'నాన్‌ ట్రేడింగ్‌ డే'. అయితే, ప్రత్యేక కారణం వల్ల ఈ రోజు కూడా స్టాక్‌ మార్కెట్లు పని చేస్తాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (BSE) రెండింటిలో ఈ రోజు బిజినెస్‌ జరుగుతుంది. 


ఈ రోజు జరిగే ట్రేడింగ్‌ సెషన్‌ మాక్‌ డ్రిల్‌ లాంటింది. అంటే, ఏదైనా అనుకోని విపత్తు ఎదురైతే, తక్షణం ఎలా స్పందించాలన్న విషయంపై ట్రేడింగ్‌ జరుగుతుంది. మాక్‌ డ్రిల్‌ అన్నాం కదాని ఇది ఉత్తుత్తి ట్రేడింగ్‌ కాదు, రియల్‌ ట్రేడింగ్‌. సాధారణ రోజుల్లో ఎలా లావాదేవీలు జరుగుతాయో, ఈ రోజు కూడా అలాగే జరుగుతాయి. 


బీఎస్‌ఈ & ఎన్‌ఎస్‌ఈ ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ జరుగుతుంది. శనివారం నాటి ప్రత్యేక సెషన్‌లో డెరివేటివ్ ప్రొడక్ట్స్‌ సహా అన్ని సెక్యూరిటీల గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ను 5 శాతంగా నిర్ణయించారు. మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్ కాంట్రాక్టులకు కూడా ఇది 5 శాతంగా ఉంటుంది.


రెండు సెషన్లుగా ట్రేడింగ్‌
ఈ రోజు ట్రేడింగ్‌ ప్రాథమిక సైట్‌ నుంచి కాకుండా డిజాస్టర్ రికవరీ సైట్ (Disaster Recovery Site) నుంచి నిర్వహిస్తారు. సైబర్ దాడులు, సాంకేతిక సమస్యలు వంటి హఠాత్‌ పరిణామాలు తలెత్తినప్పుడు, మార్కెట్‌ డేటాను రక్షించేందుకు DR సైట్ పని చేస్తుంది. ఫలితంగా, ఆకస్మిక అవాంతరాల సమయంలోనూ ట్రేడింగ్ సురక్షితంగా మారుతుంది. ఈ రోజు DR సైట్‌లో రెండు సెషన్లుగా ట్రేడ్‌ జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9.15 నుంచి 10 గంటల వరకు; రెండో ట్రేడింగ్ సెషన్ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. 


శుక్రవారం నాడు సూపర్‌ పెర్ఫార్మెన్స్‌
2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో GDP వృద్ధి అద్భుతంగా 8.4 శాతంగా నమోదు కావడం, పాజిటివ్‌ గ్లోబల్ సిగ్నల్స్ కారణంగా మార్చి నెల మొదటి ట్రేడింగ్ సెషన్‌లో భారతీయ స్టాక్ మార్కెట్లు సూపర్‌ పెర్ఫార్మెన్స్‌ చేశాయి. బ్యాంకింగ్ ఎనర్జీ స్టాక్స్‌లో ఇన్వెస్టర్ల నుంచి భారీ కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ & నిఫ్టీ చారిత్రక గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 73,819 పాయింట్లు, నిఫ్టీ 22,353 పాయింట్ల రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 1245 పాయింట్ల జంప్‌తో 73,745 వద్ద, NSE నిఫ్టీ 356 పాయింట్ల జంప్‌తో 22,338 వద్ద క్లోజయ్యాయి.


స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం నాటి జంప్‌కు బ్యాంకింగ్ స్టాక్స్ అతి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయి. నిఫ్టీ బ్యాంక్ 2.53 శాతం పెరిగి 1166 పాయింట్లతో ముగిసింది. నిఫ్టీ బ్యాంక్‌లోని మొత్తం 12 షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. దీంతోపాటు ఆటో, FMCG, మెటల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు భారీగా పెరిగాయి. అయితే.. హెల్త్‌కేర్, ఫార్మా, ఐటీ షేర్లు క్షీణించాయి. మిడ్‌ క్యాప్ & స్మాల్‌ క్యాప్ రంగాల స్టాక్స్‌లో కూడా పచ్చదనం కనిపించింది. ఈ రెండు ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి.


మరో ఆసక్తికర కథనం: రూ.63 వేలు దాటిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే!`