Stocks to watch today, 30 January 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 47 పాయింట్లు లేదా 0.27 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,736 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


అదానీ ఎంటర్‌ప్రైజెస్: షేర్ ధరల్లో తీవ్ర పతనం, శుక్రవారం ప్రారంభమైన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు (FPO) పెద్దగా ప్రతిస్పందన లేకపోవడం వంటి కారణాలతో అందరి దృష్టి ఈ రోజు ఈ స్టాక్ కదలికపైనే ఉంటుంది. ఆఫర్ ధరలో కోత, FPO సబ్‌స్క్రిప్షన్ కోసం టైమ్‌లైన్ పొడిగింపును బ్యాంకర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారమే FPO జరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో భాగంగా ఉన్న అదానీ గ్రూప్ స్టాక్స్‌కు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై అభిప్రాయాలు చెప్పాలని మార్కెట్ పార్టిసిపెంట్లను గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ MSCI Inc కోరింది.


NTPC: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్వతంత్ర నికర లాభం 5.4% పెరిగి రూ. 4,476.25 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం ఏడాదికి (YoY) 37% పెరిగి రూ. 41,410.50 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరు మీద రూ. 4.25 మధ్యంతర డివిడెండ్‌ను కూడా బోర్డు ఆమోదించింది.


L&T: 2022 డిసెంబరు త్రైమాసిక ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి ఈ కంపెనీ బోర్డు ఇవాళ సమావేశమవుతుంది. సంవత్సరానికి 16% వృద్ధితో రూ. 45,882 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని, 5% వృద్ధితో రూ. 2,615 నికర లాభాన్ని ఈ కంపెనీ ప్రకటిస్తుందని మార్కెట్ అంచనా వేసింది.


టెక్ మహీంద్ర: 2022 డిసెంబరు త్రైమాసిక ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదించడానికి ఈ కంపెనీ బోర్డు ఇవాళ సమావేశమవుతుంది. ఏకీకృత ఆదాయం దాదాపు 3% QoQలో పెరిగి రూ. 13,490 కోట్లకు చేరుకుంటుందని అంచనా. 7 త్రైమాసికాల్లో ఇదే అతి తక్కువ వృద్ధి అవుతుంది. డాలర్ రాబడి వృద్ధి కూడా కేవలం 0.2% పెరుగుదలతో $1,642 మిలియన్లకు మధ్యస్థంగా ఉంటుందని అంచనా. ఏకీకృత నికర లాభం QoQలో 3% తగ్గి రూ. 1,245 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.


HDFC బ్యాంక్: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను (HDFC) ఈ బ్యాంక్‌లో విలీనం చేయడంపై ఫిబ్రవరి 3న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లోని ముంబై బెంచ్‌లో తుది విచారణ జరగనుంది. ప్రతిపాదిత విలీనానికి ఇప్పటికే ఈక్విటీ వాటాదారులు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి ఆమోదం లభించింది.


టాటా మోటార్స్: ఈ వాహన తయారీ సంస్థ, ఇంటర్నల్‌ కంబన్షన్‌ ఇంజిన్లతో నడిచే ప్యాసింజర్ వాహనాల ధరలను బుధవారం (ఫిబ్రవరి 1, 2023) నుంచి పెంచనుంది. మోడల్‌ను బట్టి కార్‌ ధరలు మారతాయి, సగటున 1.2% పెరుగుతాయి.


వేదాంత: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ ఏకీకృత నికర లాభం 41% క్షీణించి రూ. 2,464 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం రూ. 33,691 కోట్లుగా నమోదైంది. ఒక్కో షేరు మీద రూ. 12.5 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది.


గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్: US హెల్త్ రెగ్యులేటర్ నుంచిఈ ఫార్మా కంపెనీకి ఊరట అందింది. ఇంపోర్ట్‌ అలెర్ట్‌లో ఉన్న ఈ కంపెనీ బడ్డీ పెసిలిటీ నుంచి US మార్కెట్‌కు Atovaquone ఓరల్ సస్పెన్షన్‌ను సరఫరా చేయడానికి USFDA వీలు కల్పించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.