Stocks to watch today, 24 February 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 52 పాయింట్లు లేదా 0.30 శాతం గ్రీన్ కలర్‌లో 17,643 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
భారత్ ఫోర్జ్: కంపెనీకి చెందిన అన్ని రక్షణ సంబంధిత పెట్టుబడులను ఒకే సంస్థలోకి తెచ్చే ప్రణాళికలో భాగంగా, ఏరాన్ సిస్టమ్స్‌లో భారత్ ఫోర్జ్‌కు ఉన్న వాటాను పూర్తి స్థాయి అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్‌కు బదిలీ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ ఆమోదించింది.
అదానీ ట్రాన్స్‌మిషన్: అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ATL RG1) జారీ చేసిన $400 మిలియన్ల సీనియర్ సెక్యూర్డ్ బాండ్లకు "స్టేబుల్" ఔట్‌లుక్‌తో "BBB-" రేటింగ్‌ను ఫిచ్ రేటింగ్స్ ధృవీకరించింది.
సనోఫీ ఇండియా: 2022 డిసెంబరు త్రైమాసికంలో సనోఫీ ఇండియా రూ. 131 కోట్ల నికర లాభాన్ని నివేదించగా, కార్యకలాపాల ద్వారా రూ. 672 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 194 తుది డివిడెండ్, రూ. 183 రెండో ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ప్రకటించింది.
ZEE ఎంటర్‌టైన్‌మెంట్: దివాలా వ్యాజ్యాల కోర్టు ఈ మీడియా కంపెనీని ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌కు అనుమతించిన నేపథ్యంలో, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ నుంచి NSE తప్పించింది.
ఆల్కెమ్ లాబొరేటరీస్: ఇండోర్‌లోని ఆల్కెమ్ లాబొరేటరీస్ తయారీ కేంద్రంలో US FDA జరిపిన తనిఖీల ప్రక్రియ పూర్తిగా ముగిసింది. తనిఖీల సమయంలో FDA జారీ చేసిన ఫామ్ 483కి ప్రతిస్పందనగా, ఈ కంపెనీ ఒక వివరణాత్మక దిద్దుబాటు, నివారణ చర్య (CAPA) ప్రణాళికను యూఎస్ రెగ్యులేటర్‌కు సమర్పించింది.
ఓలెక్ట్రా గ్రీన్‌టెక్: మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, హైడ్రోజన్ బస్‌ల ఉత్పత్తి కోసం రిలయన్స్‌తో సాంకేతికత భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
ఇన్ఫోసిస్: ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడేందుకు మైక్రోసాఫ్ట్‌తో తన ఒప్పందం గడువును పెంచుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
రైల్ వికాస్ నిగమ్: మధ్యప్రదేశ్ మధ్య క్షేత్ర విద్యుత్ వితరణ్ నుంచి రూ.197 కోట్ల విలువైన ఆర్డర్‌ను రైల్ వికాస్ నిగమ్ అందుకుంది.
కర్ణాటక బ్యాంక్: చిన్న ఆదాయ వర్గాలకు రుణాలు అందించడానికి కర్నాటక బ్యాంక్ & పైసాలో డిజిటల్ (Paisalo Digital) కలిసి కో-లెండింగ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ONGC: భారతదేశపు అగ్ర శ్రేణి చమురు & గ్యాస్ ఉత్పత్తిదారు ONGC, అరేబియా సముద్రంలో దాని ప్రధాన గ్యాస్-బేరింగ్ అసెట్‌లో రికార్డ్ స్థాయిలో 103 బావులను తవ్వడానికి 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల కంపెనీ ఉత్పత్తి మరో 100 మిలియన్ టన్నులు పెరుగుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.