Evans Electric Company: ఎవాన్స్ ఎలక్ట్రిక్ లిమిటెడ్‌ (Evans Electric Ltd) షేర్లు ఇవాళ్టి ‍(శుక్రవారం) సెషన్‌లోనూ అప్పర్‌ సర్కూట్‌ కొట్టాయి. 10 శాతం పెరిగి, రూ. 189.75 వద్ద లాక్ అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి. ఏ రోజుకు ఆ రోజు కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేస్తూనే ఉన్నాయి. 


ఎవాన్స్ ఎలక్ట్రిక్ షేర్లతో పోలిస్తే, S&P BSE సెన్సెక్స్ మధ్యాహ్నం 12:15 గంటలకు 0.52 శాతం క్షీణించి 61,428 వద్ద ఉంది.


షేర్‌ లావాదేవీల్లో భారీ వాల్యూమ్స్‌ కనిపిస్తున్నాయి. ఈ కౌంటర్ సగటు ట్రేడింగ్ వాల్యూమ్‌ అనేక రెట్లు పెరిగి 1,10,000 షేర్లకు చేరింది. కంపెనీ మొత్తం ఈక్విటీలో ఇది 8 శాతం. మధ్యాహ్నం 12:15 గంటలకు, BSEలో 32,500 షేర్ల బయ్‌ ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇంత భారీగా చేతులు మారుతున్నా, రెండు వారాల క్రితం వరకు సగటున కేవలం 10,000 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. రెండు వారాల నుంచి అనూహ్యంగా లావాదేవీలు పెరిగాయి.


8 రోజుల్లో డబుల్‌
గత ఎనిమిది ట్రేడింగ్ రోజుల్లో ఈ స్టాక్ భారీ హై జంప్‌ చేసింది. ఈ నెల 7వ తేదీ నాటి రూ. 86 స్థాయి నుంచి ఇప్పటివరకు 121 శాతం జూమ్‌ అయింది. రెండున్నర ఏళ్ల క్రితం, 2020 జులై 1న రికార్డు స్థాయిలో రూ. 300కు స్క్రిప్‌ చేరింది. అక్కడి నుంచి ఫల్టీలు కొట్టుకుంటూ కింద పడింది. ఏడాదిన్నర క్రితం, 2021 మార్చిలో దాదాపు రూ. 300 స్థాయికి వరకు వెళ్లినా, సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. లోయర్‌ సర్క్యూట్లతో భారీగా పతనమైంది. ఇప్పుడు మళ్లీ పైపైకి ఎగిరే ప్రయత్నం చేస్తోంది.


గత ఆరు నెలల్లో ఈ కౌంటర్‌ 126 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 104 శాతం లాభాలు ఇచ్చింది. ఇదంతా ఈ ఎనిమిది రోజుల్లో కనిపించిన వృద్ధే. అంతకుముందు వరకు దాదాపు ఫ్లాట్‌గా ట్రేడయింది.


BSEలో "M" గ్రూప్ క్రింద SME సెగ్మెంట్‌లో ఎవాన్స్‌ ఎలక్ట్రిక్‌ ట్రేడ్‌ అవుతుంది. SME సెగ్మెంట్‌లో ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్‌మెంట్ T+2 ‍‌(ట్రేడింగ్‌ డే + మరో రెండు రోజులు) ప్రాతిపదికన జరుగుతుంది. 


సెప్టెంబర్ 30, 2022 నాటికి ఎవాన్స్ ఎలక్ట్రిక్‌కు 1.37 మిలియన్ల ఈక్విటీ షేర్లు ఉన్నాయి. కంపెనీలో ప్రమోటర్లకు 59.44 శాతం వాటా ఉంది. మిగిలిన 40.56 శాతం హోల్డింగ్ వ్యక్తిగత వాటాదారులు (23.32 శాతం), కీలక మేనేజ్‌మెంట్ పర్సన్‌ నెల్సన్ లియోనెల్ ఫెర్నాండెజ్ (14.69 శాతం) దగ్గర ఉంది. 


కళ్లు చెదిరే లాభాలు
2022-23 (H1FY23) మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్-సెప్టెంబర్), ఎవాన్స్ ఎలక్ట్రిక్ రూ. 2.73 కోట్ల నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 37.67 లక్షలుగా ఉంది. మునుపటి ఆర్థిక సంవత్సరం (FY22) మొత్తం నికర లాభం రూ. 82 లక్షలతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే అది రెండింతలు పెరిగింది.


పెద్ద మోటార్లు, జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ల మరమ్మత్తు & నిర్వహణ రంగంలో ఎవాన్స్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ వ్యాపారం చేస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.