Sachin's Profit From Azad Engineering Shares: క్రికెట్‌లోనే కాదు, స్టాక్‌ మార్కెట్‌లోనూ తాను మాస్టరేనని సచిన్‌ టెండూల్కర్‌ నిరూపించుకున్నాడు. ఒక కొత్త కంపెనీ షేర్ల నుంచి ఆరు నెలల్లోనే 15 రెట్లకు పైగా ఆర్జించాడు. ఆ కంపెనీ పేరు ఆజాద్‌ ఇంజినీరింగ్‌.


ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌ స్టాక్‌ మార్కెట్‌లోకి వచ్చి అతి కొద్ది కాలమే అయింది. గత ఏడాది డిసెంబర్‌ 20-22 తేదీల్లో, 740 కోట్ల రూపాయల IPOను తీసుకొచ్చింది. ఒక్కో షేర్‌ను రూ. 499 నుంచి రూ. 524 రేటుకు మార్కెట్‌లో ఆఫర్‌ చేసింది. 28 షేర్లు ఒక లాట్‌ చొప్పున అమ్మింది. విజయవంతమైన ఇన్వెస్టర్లకు డిసెంబర్‌ 26న కంపెనీ షేర్లు అలాట్‌ అయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSEలో, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEలో అదే నెల 28న ఈ కంపెనీ షేర్లు లిస్ట్‌ అయ్యాయి. 37 శాతం ప్రీమియంతో రూ. 720 వద్ద లిస్టింగ్‌ జరిగింది. అప్పటి నుంచి ఈ షేర్లు పైపైకి పరుగులు పెడుతూనే ఉన్నాయి.


మల్టీబ్యాగర్‌ స్టాక్‌
మార్కెట్‌లో లిస్టయి ఆరు నెలలు కూడా కాలేదు, ఆజాద్‌ ఇంజినీరింగ్‌ షేర్లు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి, పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చాయి. లిస్టింగ్‌ నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్‌ 185 శాతం పైగా పెరిగింది. 


ఒక రిటైల్‌ ఇన్వెస్టర్‌, ఒక్కో షేర్‌కు రూ. 524 చొప్పున, IPOలో ఒక లాట్‌ దక్కించుకుని ఉంటే, అప్పుడు అతని పెట్టుబడి రూ. 14,672 (28 షేర్లు x 524) అవుతుంది. ఇప్పుడు ఒక్కో షేర్‌ రూ. 1934 దగ్గర ఉంది. ఈ లెక్కన అతని పెట్టుబడి విలువ రూ. 54,152కు (28 షేర్లు x 1934) పెరిగింది, ఒక లాట్‌పై రూ. 39,480 లాభం ‍‌(54,152 - 14,672) వచ్చింది.


15 రెట్లు పెరిగిన సచిన్‌ డబ్బు
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ షేర్ల ద్వారా భారీగానే సంపాదించాడు. గత 6 నెలల్లో, సచిన్ పెట్టుబడి దాదాపు 15 రెట్లు పెరిగింది. సచిన్ టెండూల్కర్, 2023 మార్చి నెలలో, ఆజాద్ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌లో రూ. 5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. తద్వారా, టెండూల్కర్‌కు ఈ కంపెనీలో 3,65,176 షేర్లు వచ్చాయి. ఒక్కో షేరును సగటున రూ. 136.92 చొప్పున కొనుగోలు చేశాడు.


ప్రస్తుతం, ఆజాద్ ఇంజినీరింగ్‌లో సచిన్ టెండూల్కర్ వాటా విలువ రూ. 72.37 కోట్లకు పెరిగింది. అంటే, ఇప్పటి వరకు సచిన్ పెట్టుబడి 14.56 రెట్లు పెరిగింది.


IPO ధరతో ‍‌(రూ. 524) పోలిస్తే, ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు ఈ ఆరు నెలల్లో 280 శాతం పెరిగాయి, లిస్టింగ్ తర్వాత 185 శాతానికి పైగా దూసుకెళ్లాయి. గత నెల రోజుల్లో 25 శాతం పైగా ర్యాలీ చేశాయి. ఈ స్టాక్‌ 52 వారాల కనిష్టం రూ. 642.40 కాగా, 52 వారాల గరిష్టం రూ. 2,080.


ఈ రోజు (గురువారం, 20 జూన్‌ 2024) ఆజాద్‌ ఇంజినీరింగ్‌ షేర్‌ 2.41 శాతం నష్టంతో రూ. 1,934.10 దగ్గర సెటిల్‌ అయింది.


ఏరోస్పేస్ కాంపోనెంట్స్‌, టర్బైన్లను ఆజాద్ ఇంజినీరింగ్‌ ఉత్పత్తి చేస్తుంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద