YSRCP Leadr buuta  Renuka meets Minister Anam :  మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో వైసీపీ నేత, ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసిన బుట్టా రేణుక మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయాలకు సంబంధం లేని ఓ కార్యక్రమంలో వీరు పాల్గొన్నప్పుడు మాట్లాడుకుంటున్న ఫోటోగా భావిస్తున్నారు. అయితే ఆనంతో బుట్టా రేణక చర్చించడంతో ఆమె పార్టీ మారుతారన్న ప్రచారం ప్రారంభమయింది. 


గతంలో టీడీపీలో చేరి మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోయిన బుట్టా రేణుక                                 


ఓ పార్టీ నేతను మరో పార్టీ నేత కలిసినట్లుగా ఫోటోలు కనిపిస్తే చాలు పార్టీ మార్పు ప్రచారం ప్రారంభమైపోతోంది. వ్యక్తిగత సమావేశాలు.. ఫంక్షన్లలో కలిసినా ఇదే  పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికలు అయిపోయి.. ఓడిపోయిన పార్టీలోని నేతలపై ఇలాంటి ప్రచారాలు ఎక్కువగా ఉంటాయి. బుట్టా రేణుక ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతంలో బుట్టా రేణుక టీడీపీలో చేరారు. మళ్లీ వైసీపీలో చేరారు. 2014  ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక పోటీ చేసి గెలిచారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో కొద్ది రోజులకే టీడీపీలో చేరారు. కానీ మళ్లీ 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. పోటీ చేయడానికి అవకాశం రాకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ ఆమెకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. కానీ భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. 


జగన్ తో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన బుట్టా రేణుక                        


ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆమె టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అధికారికంగా బుట్టా రేణుక కానీ ఆమెకు సంబంధించిన వారు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి బుట్టా రేణుక హాజరయ్యారు. దీని ద్వారానే తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఆమె స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. 


విడదల రజనీపైనా పార్టీ మార్పు ప్రచారాలు                          


కొంత మంది వైసీపీ నేతలపై పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి వారిలో మాజీ మంత్రి విడదల రజనీ కూడా ఉన్నారు. ఆమె బీజేపీ నేతలతో  సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వీటిపై ఎక్కడా స్పందించని విడుదల రజనీ కూడా .. జగన్మోహన్ రెడ్డితో నిర్వహించిన భేటీకి హాజరయ్యారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న సమయంలోనే కీలక సమావేశాలకు హాజరు కాకపోతే.. ఇంకా ఎక్కువగా ప్రచారాలు జరుగుతాయన్న ఉద్దేశంతో వీరు రిస్క్ తీసుకోకుండా వెళ్తున్నారని భావిస్తున్నారు.