Tiruala Latest News: తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో నిర్దేశిత టోకెన్లు శ్రీవారి మెట్టు వద్ద స్కాన్ చేసినవి ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం (జూన్ 20) నిర్వహించారు. శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం (జూన్ 21) నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది.


కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.


దర్శన క్యూలైన్లు తనిఖీ చేసిన టీటీడీ ఈఓ.. పారిశుద్ధ్య అధికారికి షోకాజ్ నోటీస్


టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులతో కలిసి గురువారం నారాయణగిరి షెడ్ల వద్ద వివిధ క్యూ లైన్లను పరిశీలించారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్లే సర్వ దర్శనం, స్లాటెడ్ సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులకు కొన్ని సూచనలు ఇచ్చారు. నారాయణగిరి షెడ్లలోని క్యూలైన్ల పరిశీలనలో భాగంగా సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడంతో సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని టీటీడీ ఈవో ఆదేశాలు ఇచ్చారు.