Gigawatt Battery Production: పది గిగావాట్ అవర్ (GWh) బ్యాటరీ ఫ్లాంట్ ఏర్పాటు కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన అమర రాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Amara Raja Advanced Cell Technologies Private Limited) పోటీలో నిలిచింది. అంతేకాదు.. ఇండస్ట్రీ జెయింట్ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group) వంటివాటితో ఢీ కొడుతోంది.
బ్యాటరీ ఫ్లాంట్ ఏర్పాటుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్
ఎలక్ట్రిక్ వెహికల్ (EV) బ్యాటరీల తయారీ కోసం 10 గిగావాట్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీ తయారీ ఫ్లాంట్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం బిడ్‌లు పిలిచింది. ఈ ఫ్లాంట్లకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) కింద మద్దతునిస్తోంది. PLI స్కీమ్ కింద, ఈ ఫ్లాంట్ల కోసం రూ. 3,620 కోట్లను భారత ప్రభుత్వం కేటాయించింది.
ఇప్పుడు జరిగేది రీబిడ్డింగ్ ప్రాసెస్. ఈ ఏడాది జనవరి 24న టెండర్లు పిలవగా, 70 GWh సామర్థ్యంతో బ్యాటరీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు బిడ్‌లు వచ్చాయి. అంటే, 10 గిగావాట్ అవర్ సామర్థ్యానికి టెండర్లు నిర్వహిస్తే 7 రెట్లు ఎక్కువ (70 GWh) స్పందన లభించింది. కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రీబిడ్డింగ్ ప్రాసెస్ నిర్వహించింది.
పోటీలో ఉన్న కంపెనీలు
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ కింద బ్యాటరీ తయారీ ఫ్లాంట్లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఏప్రిల్ 22తో ముగిసింది. టెక్నికల్ బిడ్‌లను నిన్న (మంగళవారం, 23 ఏప్రిల్ 2024) ఓపెన్ చేశారు. ఈ దశలో అమర రాజా సహా 7 కంపెనీలు పోటీలోకి వచ్చాయి. అవి... ACME క్లీన్‌టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమర రాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అన్వీ పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, JSW నియో ఎనర్జీ లిమిటెడ్, లూకాస్ TVS లిమిటెడ్, లూకాస్ TVS లిమిటెడ్.
10 గిగావాట్ అవర్స్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్ (ACC) కోసం PLI స్కీమ్‌ను 2021లోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రూ. 18,100 కోట్లతో 50 GWh ACC తయారీ సామర్థ్యాన్ని సాధించడం ఈ పథకం లక్ష్యం.
50 GWh ACC లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 30 GWh ACC బ్యాటరీ తయారీ సామర్థ్యంతో ఫ్లాంట్లను ఏర్పాటు చేయడానికి 2022లో భారత ప్రభుత్వం PLI స్కీమ్‌ను ప్రకటించింది. దీనిలో, ఓలా సెల్ టెక్నాలజీస్ (Ola Cell Technologies) 20 GWh సామర్థ్యంతో అత్యధిక వాటా దక్కించుకుంది. ACC ఎనర్జీ స్టోరేజ్ (రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ పేరిట బిడ్), రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీ స్టోరేజీకి తలో 5 GWh చొప్పున దక్కించుకున్నాయి.
ACC చొరవ కింద దేశీయంగా తయారయ్యే బ్యాటరీలకు మరింత విలువను జోడించడం, తయారీ ఖర్చును తగ్గించి ప్రపంచవ్యాప్తంగా పోటీలో నిలపడం కూడా ఈ స్కీమ్ ఉద్దేశం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే