భారత స్టాక్‌ మార్కెట్లు నేడు ఒడుదొడులకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో కళకళలాడిన సూచీలు ఆఖర్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఓపెన్‌ కావడం మదుపర్లలో సానుకూల సెంటిమెంట్‌కు దారితీసింది.  ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 700+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  250+ లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఆఖరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లో ముగిశాయి.


క్రితం సెషన్లో 57,276 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,795 వద్ద భారీ గ్యాప్‌అప్‌తో మొదలైంది. అక్కడ్నుంచి కొనుగోళ్లు జోరందుకోవడంతో 58,084 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. దాదాపు 800 పాయింట్ల మేర లాభపడింది. మధ్యాహ్నం 2 గంటలకు ఐరోపా మార్కెట్లు ఆరంభం కాగానే ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. సూచీ 57,119 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి చివరికి 76 పాయింట్ల నష్టంతో 57,200 వద్ద ముగిసింది.


Also Read: MSME Sector Budget 2022 Expectations: నిర్మలమ్మా..! 'సూక్ష్మం' ఎరిగి 'లాభం' చేకూర్చండి!!


Also Read: Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ


బుధవారం 17,110 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,208 వద్ద భారీ గ్యాప్‌ అప్‌తో ఆరంభమైంది. ఆ తర్వాత ఊర్ధ్వ ముఖంగా పయనిస్తూ 17,373 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 260 పాయింట్ల లాభంలో కొనసాగింది. ఆ తర్వాత 17,077 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి చివరికి 8 పాయింట్ల నష్టంతో 17,101 వద్ద ముగిసింది.


బ్యాంక్‌ నిఫ్టీ ఒడుదొడుకుల మధ్య సాగింది. ఉదయం 38,246 వద్ద మొదలైన సూచీ 38,421 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. దాదాపుగా 250 పాయింట్ల లాభం కళ్ల చూసింది. ఆ తర్వాత 37,581 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 292 పాయింట్ల నష్టంతో 37,689 వద్ద ముగిసింది.


నిఫ్టీలో 31 కంపెనీలు లాభాల్లో 19 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, యూపీఎల్‌, సన్‌ఫార్మా, టాటా కన్జూమర్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. మారుతీ, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌ నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌ సూచీలు నష్టపోయాయి.