గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఖమ్మంలో ప్రారంభించారు. శుక్రవారం ఖమ్మంలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్‌ను మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్‌ కాకుండా జిల్లాల్లో నెలకొల్పిన తొలి క్యాథ్‌ల్యాబ్‌ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి, నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లోనే ఈ క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అధునాతన క్యాథ్ ల్యాబ్, ట్రామా కేర్, మిల్క్ బ్యాంక్ ని ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, టీస్ఎంఎస్ఐడీసీ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రు.7.5 కోట్లతో క్యాథ్ ల్యాబ్ ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో ఇది నాలుగో క్యాథ్ ల్యాబ్. ఈ సేవలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నిమ్స్, ఉస్మానియా, ఎంజీఎం ఆసుపత్రుల్లో మాత్రమే ఈ ల్యాబ్ ఉంది. హైదరాబాద్‌కు దూరంలో ఖమ్మం ఉన్నందున ఇక్కడి ప్రజలకు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేశాం. గుండె సంబంధ సమస్యలకు లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్స ఇక్కడ ఉచితంగా ఇకపై అందనుంది. ఇందుకోసం కార్డియాలజిస్టులను కూడా నియమించడం జరిగింది.’’


త్వరలోనే ఆ సేవలు కూడా..
‘‘మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరిక మేరకు క్యాన్సర్ రోగుల కోసం త్వరలో కీమో థెరపీ, రేడియో థెరపీ సేవలను కూడా అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఆర్థిక ఏడాదిలో ఎంఅర్ఐ కూడా ఏర్పాటు చేస్తాం. మార్చురీలను ఆధునికీకరణ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇక్కడి మర్చురిని ఆధునికీకరణ చేస్తాం. కరోనా రెండో వేవ్‌లో మనం చేసిన జ్వర సర్వే దేశానికే ఆదర్శం. కేంద్ర సంస్థలు సైతం ప్రశంసలు కురిపించాయి. దేశ వ్యాప్తంగా అమలు చేయాలని సూచించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఫీవర్ సర్వే పలు జిల్లాల్లో ముగిసింది. అక్కడ రెండో రౌండ్ సర్వే కూడా ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77,33,427 ఇళ్లలో జ్వర సర్వే చేయడం జరిగింది. 3,45,951 కిట్లను అందించాం.


‘‘వ్యాక్సినేషన్ రెండు డోసులు వేగంగా పూర్తి చేసిన జిల్లాగా కరీంనగర్ దక్షిణ భారత్‌లో రికార్డు నెలకొల్పింది. ఇందులో కృషి చేసిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు శుభాకాంక్షలు. రెండు డోసులు పూర్తి చేయడంలో ఖమ్మం జిల్లా 94 శాతంలో రెండో స్థానంలో ఉంది. కరీంనగర్ తర్వాత ఖమ్మం ఆ రికార్డు నెలకొల్పాలని కోరుకుంటున్నాను. అన్ని విభాగాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి. వచ్చే ఏడాది సిద్దిపేటలో, 2024లో మహబూబ్‌నగర్‌ బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.7 కోట్లు ఖర్చు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. క్యాథ్‌ల్యాబ్‌ల్లో గుండె జబ్బుల పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలుంటాయి.’’ అని హరీశ్ రావు అన్నారు.