Sensex Down: కేవలం ఏడంటే ఏడు ట్రేడింగ్ రోజులు... ఈ ఏడు ఏం చేయగలదో స్టాక్ మార్కెట్ నిరూపించింది. ఎంత సంపదను మార్కెట్ మాయ చేయగలదో కొత్త వాళ్లకు తెలిసొచ్చింది. సోమవారం (27 ఫిబ్రవరి 2023)) ట్రేడింగ్‌లో 176
పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ సెన్సెక్స్ (Sensex), మొత్తంగా ఏడు ట్రేడింగ్ డేస్‌లో 2,031 పాయింట్లు కోల్పోయింది. 7 రోజుల నాన్‌స్టాప్ సెల్లింగ్ చూసిన నిఫ్టీ50 కూడా, బడ్జెట్ రోజు నాటి కనిష్ట స్థాయి 17,353 కంటే దిగువకు పడిపోయింది. ఆ తర్వాత నష్టాలను కొంతమేర పూడ్చుకుంది.
సోమవారం, అన్ని BSE లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ విలువ రూ. 258 లక్షల కోట్లకు పడిపోయింది. ఐటీ, మెటల్స్, మీడియా రంగాల సూచీలు 2-4% మధ్య నష్టపోయాయి. అయితే, రియాల్టీ స్టాక్స్ మాత్రం దలాల్ స్ట్రీట్‌లోని దయనీయ పరిస్థితిని ధిక్కరించాయి. నిఫ్టీ రియాల్టీ 2% పైగా పెరిగింది. మాక్రోటెక్ డెవలపర్స్ 11% ర్యాలీ చేసి, రియాల్టీ గ్రూప్‌నకు నాయకత్వం వహించింది.
దలాల్ స్ట్రీట్‌ను దిగజార్చిన 10 అంశాలు:
1) ప్రపంచ మార్కెట్లు
గ్లోబల్ మార్కెట్లను శాసిస్తున్న బేరిష్ సెంటిమెంట్‌కు భారత మార్కెట్లు కూడా తలొగ్గాయి. డౌ జోన్స్ గత వారంలో 3% పడిపోయింది, వరుసగా నాలుగో వారం కూడా క్షీణించింది. ఇవాళ ఆసియా మార్కెట్లు కూడా ఒత్తిడిలో ఉన్నాయి. నికాయ్ 0.11%, హాంగ్ సెంగ్ 0.33%, ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 1.12% నష్టపోయింది.
2) ఫెడ్ భయం
యుఎస్‌లో ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో, వచ్చే మూడు సమావేశాల్లోనూ వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ పెంచవచ్చని మార్కెట్ భయపడుతోంది. వచ్చే సమావేశంలో కనీసం 50 బేసిస్ పాయింట్ల పెంపు ఉంటుందని భావిస్తోంది.
3) US డేటా
ద్రవ్యోల్బణం గేజ్‌గా ఫెడ్ భావించే PCE ప్రైస్ ఇండెక్స్, డిసెంబర్‌లో 0.2% పెరిగింది, జనవరిలో ఏకంగా 0.6% పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని అణగదొక్కడానికి గట్టి చర్యలు అవసరమంటూ అధికార గణం వ్యాఖ్యానాలు వినిపించాయి.
4) ఎఫ్‌ఐఐల విక్రయాలు
2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు రూ. 31,000 కోట్ల విలువైన ఇండియన్ స్టాక్స్‌ను డంప్ చేశారు. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌ఐఐల నెట్ షార్ట్ పొజిషన్లు మళ్లీ లక్ష కాంట్రాక్టులకు పైగా పెరిగాయని F&O డేటా చూపుతోంది.
5) Q3 ఆదాయాలు
డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు, ఆయా కంపెనీల స్టాక్ వాల్యుయేషన్లను పెంచడంలో లేదా ఉన్న వాల్యుయేషన్‌కు మద్దతుగా నిలబడడంలో విఫలమయ్యాయి. నిఫ్టీ50 కంపెనీల్లో 50% శాతం కంపెనీలు మాత్రమే PAT అంచనాలను అందుకున్నాయి, 40% శాతం కంపెనీలు మార్కెట్‌ను నిరాశపరిచాయి.
6) అదానీ స్టాక్స్
అదానీ స్టాక్స్‌లో ఎడతెగని అమ్మకాల ఒత్తిడి కూడా ఈక్విటీ మార్కెట్‌ను కుంగదీస్తోంది. ఇవాళ, 10 అదానీ స్టాక్స్‌లో 9 రెడ్ జోన్‌లో ట్రేడవుతున్నాయి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యధికంగా 6.5% పడిపోయింది. మరో ఆరు గ్రూప్ స్టాక్స్ 5% లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి.
7) డాలర్ ఇండెక్స్
ఆరు ప్రధాన కరెన్సీల విలువల ప్రాతిపదికన లెక్కించే US డాలర్ ఇండెక్స్, 105 మార్క్ పైన ట్రేడవుతోంది. ఫిబ్రవరిలో ఈ ఇండెక్స్ 3% పెరిగింది.
8) బాండ్ ఈల్డ్స్
సాధారణంగా, వడ్డీ రేటు అంచనాలకు అనుగుణంగా కదిలే 'రెండు సంవత్సరాల U.S. ట్రెజరీ బాండ్' ఈల్డ్ 3.4 బేసిస్ పాయింట్లు పెరిగి 4.839% వద్ద ఉంది. శుక్రవారం నాటి మూడు నెలల గరిష్ఠ స్థాయి 4.840% కు మిల్లీమీటర్ దూరంలో ఉంది.
9) సాంకేతిక అంశాలు
17,368 స్థాయిలో ఉన్న 200 డేస్ SMA మద్దతును ఇవాళ నిఫ్టీ కోల్పోయింది. 17552-17620 రెసిస్టెన్స్ జోన్‌గా ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.
10) ఎల్ నినో
భారత్‌లో, రబీ పంటకు ముందు మార్చిలో వేడిగాలులు వీస్తాయన్న అంచనాలు, ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ రుతుపవనాలు నమోదవుతాయన్న లెక్కలు వంటివి ఆహార ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆదాయాల పతనం వంటి ఆందోళనలను మరింత పెంచుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.