Adani Ports: దేశంలోని అతి పెద్ద బిజినెస్ గ్రూపుల్లో ఒకటైన అదానీ గ్రూప్‌నకు విదేశాల్లోనూ బలమైన ఉనికి ఉంది. అదానీ గ్రూప్ ATMగా పిలిచే "అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్" (Adani Ports & SEZ) లిమిటెడ్, విదేశాల్లో దూకుడుగా విస్తరిస్తోంది. నౌకాశ్రయాల నిర్వహణను చూసుకునే ఈ కంపెనీ (Port Operating Company) కన్ను ఇప్పుడు ఫిలిప్పీన్స్‌పై (Philippines) పడింది.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (APSEZ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కరణ్ అదానీ (Karan Adani) ఈ నెల ప్రారంభంలో ఫిలిప్పీన్స్ వెళ్లారు. ఆ పర్యటన సందర్భంగా, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ ఆర్ మాక్రోస్ జూనియర్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 02న జరిగిన సమావేశం అనంతరం ఫిలిప్పీన్స్ అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఫిలిప్పీన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ పోర్ట్స్ ఆసక్తి కనబరిచినట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది.
అదానీ పోర్ట్స్ ప్లాన్
ఫిలిప్పీన్స్ అధ్యక్ష కార్యాలయం చేసిన ప్రకటన ప్రకారం.. ఫిలిప్పీన్స్‌లోని బటాన్‌లో ఉన్న ఓడరేవును (Bataan Port) కొనుగోలు చేయడానికి అదానీ పోర్ట్స్ ఆసక్తిగా ఉంది. అక్కడ కొత్తగా డీప్ సీ పోర్ట్ (deep-sea port) డెవలప్ చేయాలని ఈ కంపెనీ యోచిస్తోంది. బటాన్‌లో 25 మీటర్ల లోతైన ఓడరేవును నిర్మించాలని ప్లాన్ చేసింది. దీనివల్ల, ఆ ఓడరేవులో పనామాక్స్ (Panamax) పరిమాణంలోని నౌకలకు బెర్త్ సౌకర్యం కల్పించొచ్చు, గ్లోబల్ ట్రేడ్ పెరుగుతుంది.
భారత్‌లో డజనుకు పైగా ఓడరేవులు
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, భారతదేశంలో అతి పెద్ద పోర్ట్ డెవలపర్ & ఆపరేటింగ్ కంపెనీ. మన దేశంలో, తూర్పు నుంచి పడమర వరకు ఈ కంపెనీ చేతిలో డజనుకు పైగా పోర్టులు ఉన్నాయి. భారతదేశ పశ్చిమ తీరంలో ఏడు ఓడరేవులు, టెర్మినల్స్ అదానీ పోర్ట్స్ ఆధీనంలో ఉన్నాయి. గుజరాత్‌లోని ముంద్రా, ట్యూనా, దహేజ్, హజీరా; గోవాలోని మోర్ముగో; మహారాష్ట్రలోని డిఘి; కేరళలోని విజింజం ఓడరేవులు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇక.. దేశంలోని తూర్పు తీరంలో 8 ఓడరేవులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా; ఒడిశాలోని ధామ్రా, గోపాల్‌పూర్; ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం, కృష్ణపట్నం; తమిళనాడులోని కాటుపల్లి, ఎన్నూర్; పుదుచ్చేరిలోని కారైకల్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
మార్చి త్రైమాసికం లెక్కలు
2024 మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలను (Q4 FY24) అదానీ పోర్ట్స్ ఇటీవలే విడుదల చేసింది. జనవరి-మార్చి కాలంలో ఈ కంపెనీ రూ. 2,014.77 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలం కంటే ఇది 76.87 శాతం ఎక్కువ. Q4 FY24లో అదానీ పోర్ట్స్ ఆదాయం రూ. 7,199.94 కోట్లకు పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రక్షణ రంగంలో మిస్సైళ్ల లాంటి స్టాక్స్ - ఏడాదిలో రెట్టింపు పైగా లాభాలు