Stock Market News Today in Telugu: ఈ వారమంతా ఇండియన్‌ మార్కెట్‌కు బాగాలేదు. వారంలో చివరి రోజైన ఇవాళ (శుక్రవారం, 19 ఏప్రిల్‌ 2024) కూడా ఈక్విటీలు డౌన్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుందనే భయంతో BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ పతనమయ్యాయి. బాంబులు ఇరాన్‌లో పడుతుంటే, మన మార్కెట్లు కుప్పకూలాయి. 


ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందని వార్తలు వస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇరాన్‌లోని కొన్ని అణు కేంద్రాలు సహా అనేక లక్ష్యాలపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. వందలాది డ్రోన్లు, క్షిపణులతో గత వారం ఇరాన్ చేసిన దాడికి, ఇప్పుడు ఇజ్రాయెల్‌ ప్రతీకారం తీర్చుకుంటుందోని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దూకుడుతో, పశ్చిమాసియాలోని రెండు శక్తిమంతమైన దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతుందనే భయాలు పెంచింది. ఈ భయంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.


ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (గురువారం) 72,488 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 550 పాయింట్లకు పైగా డైవ్ చేసి 72 వేల పాయింట్ల దిగువన ప్రారంభమైంది. ఉదయం 9.20 గంటలకు 600 పాయింట్లకు పైగా నష్టంతో 71,890 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో 21,795 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.


విస్తృత మార్కెట్లలో... BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ తలా ఒక శాతం పడ్డాయి. 


ఇండియా విక్స్‌ ఏకంగా 10% జంప్‌ చేసింది.


సెక్టార్ల వారీగా చూస్తే... అన్ని రంగాలు రెడ్‌ జోన్‌లోకి చేరాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 1.7 శాతం, మీడియా 1.4 శాతం, ఐటీ 1.2 శాతం నష్టాలతో, మార్కెట్లకు కిందకు లాగుతున్నాయి.


ప్రి-ఓపెన్ సెషన్ సిగ్నల్స్
ఉదయం, గిఫ్ట్‌ నిఫ్టీ ఫ్యూచర్స్ 300 పాయింట్లకు పైగా పడిపోయింది. మన మార్కెట్‌ ప్రి-ఓపెన్ సెషన్‌లోనూ భారీ పతనం సంకేతాలు అందాయి. ప్రి-ఓపెన్ సెషన్ లో సెన్సెక్స్ 490 పాయింట్లు పతనమై 72 వేల పాయింట్ల స్థాయి దిగువకు వచ్చింది. నిఫ్టీ కూడా 135 పాయింట్ల నష్టంలో ఉంది.


ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 451.50 పాయింట్లు లేదా 0.62% తగ్గి 72,037.49 దగ్గర; NSE నిఫ్టీ 131.80 పాయింట్లు లేదా 0.60% తగ్గి 21,864.05 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
క్షిపణి దాడుల వార్త తెలియగానే ఆసియా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో జపాన్‌కు చెందిన నికాయ్‌ దాదాపు 3 శాతం నష్టాల్లో ఉంది. టాపిక్స్ ఇండెక్స్ 1.3 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా కోస్పి 1.8 శాతం క్షీణించింది. కోస్‌డాక్ 1.34 శాతం నష్టాల్లో ఉంది. హాంగ్‌కాంగ్‌లో హాంగ్ సెంగ్ ఫ్యూచర్స్ కూడా 1 శాతం కంటే ఎక్కువ నష్టాన్ని మూటగట్టుకుంది.


దీనికిముందు, గురువారం సెషన్‌లో, అమెరికా మార్కెట్‌లో మిశ్రమ ధోరణి కనిపించింది. S&P 500 వరుసగా ఐదో సెషన్‌లో నష్టాల్లో ఉంది. నాస్‌డాక్ 0.52 శాతం పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ మాత్రం స్వల్పంగా పెరిగింది. 


యూఎస్‌ మాన్యుఫాక్చరింగ్‌ డేటా స్ట్రాంగ్‌గా రావడంతో అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.526 శాతం వద్ద ఉంది. మిడిల్‌ ఈస్ట్‌లో టెన్షన్ల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 3% పైగా పెరిగింది, $90 పైన ట్రేడ్‌ అవుతోంది. గోల్డ్ ఒక్కసారిగా దూసుకెళ్లింది, ఔన్సుకు $2,427 దగ్గర ఉంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి