Stock Market News Today in Telugu: ఎలుగుబంట్లు కొట్టిన దెబ్బకు నిన్న ‍(బుధవారం, 17 జనవరి 2024) 2% పైగా పతనమైన భారతీయ స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (గురువారం) కూడా నొప్పితో విలవిల్లాడుతున్నాయి. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ & నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా జారిపోయాయి. రెండు ప్రధాన సూచీలు 0.50 శాతానికి పైగా నష్టాలతో గ్యాప్‌-డౌన్‌లో ఓపెన్‌ అయ్యాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (బుధవారం) 71,501 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 477 పాయింట్లు లేదా 0.67 శాతం నష్టంతో 71,018.86 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 21,572 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 158 పాయింట్లు లేదా 0.73 శాతం బలహీనతతో 21,414.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


బ్రాడర్‌ మార్కెట్‌లో... BSE మిడ్‌ క్యాప్‌ సూచీ 0.11 శాతం స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.34 శాతం వరకు క్షీణించాయి.


మార్కెట్‌ ఓపెనింగ్‌ సెషన్‌లో, బ్యాంకింగ్ & ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి చాలా బలంగా ఉంది. బుధవారం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతానికి పైగా పడిపోయాయి. HDFC బ్యాంక్ పేలవమైన త్రైమాసిక ఫలితాలు బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ స్టాక్స్‌ మీద ఒత్తిడి పెంచాయి.


ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్‌30 ప్యాక్‌లోని 20 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి, మిగిలిన 10 షేర్లు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లో ఉన్న ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్ 3-5 శాతం వరకు క్షీణించాయి. నిఫ్టీ50లో.. LTI మైండ్‌ట్రీ దాదాపు 10 శాతం తగ్గింది. మరోవైపు... టాటా మోటార్స్, రిలయన్స్, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, ONGC, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.


గత ఒకటిన్నర సంవత్సరాల్లో అతి పెద్ద పతనం
గత ఒకటిన్నర సంవత్సరాల్లో, ఒక్క రోజులో ఎన్నడూ లేనంత అతి పెద్ద క్షీణత బుధవారం కనిపించింది. 2022 జూన్ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇదే అతి పెద్ద ఒక రోజు పతనం. అంతకుముందు మంగళవారం కూడా రెండు ప్రధాన దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి.


ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 591.32 పాయింట్లు లేదా 0.83% తగ్గి 70,909.44 దగ్గర; NSE నిఫ్టీ 213.95 పాయింట్లు లేదా 0.99% తగ్గి 21,358.00 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
అమెరికా మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లో ఉన్నాయి. వాల్ స్ట్రీట్‌లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.25 శాతం నష్టపోయింది. S&P 500 0.56 శాతం క్షీణించగా, నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 0.59 శాతం క్షీణించింది. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. హాంగ్ సెంగ్, CSI 300 0.6 శాతం వరకు తగ్గాయి. నికాయ్‌ ఫ్లాట్‌గా ఉంది. ASX 200 0.6 శాతం తగ్గింది. కోస్పి 0.6 శాతం లాభపడింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి