Stock Market News Today in Telugu: ఎలుగుబంట్ల పంజా దెబ్బకు భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 15 జనవరి 2024) విలవిల్లాడుతున్నాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ వరుసగా దాదాపు 1100 పాయింట్లు, 380 పాయింట్ల నష్టంతో ట్రేడ్ ప్రారంభించాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 1552 పాయింట్లు పడిపోయింది. ఇండెక్స్ హెవీ వెయిట్ HDFC బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను నిరాశపరిచాయి. HDFC బ్యాంక్ షేర్లు రూ.109 తగ్గి రూ.1570 వద్ద ప్రారంభమయ్యాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (మంగళవారం) 73,129 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 1130 పాయింట్లు లేదా 1.40 శాతం భారీ నష్టంతో 71,998.93 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. మంగళవారం 22,032 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 384 పాయింట్ల బలహీనతతో 21,647.25 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
బ్రాడర్ మార్కెట్‌లో... BSE మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు 0.9 శాతం వరకు క్షీణించాయి.
బ్యాంకు షేర్లలో పతనం
మంగళవారం సాయంత్రం, మార్కెట్ పని గంటలు ముగిసిన తర్వాత, HDFC బ్యాంక్ Q3 FY24 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రభావం ఈ రోజు ఉదయం కనిపించింది. సెన్సెక్స్‌లోని చాలా బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు లోయర్ సైడ్‌లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీలోనూ ఇదే పరిస్థితి.
ట్రేడ్ ప్రారంభంలో టాప్ గెయినర్స్
బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో, సెన్సెక్స్‌లో... కొచ్చిన్ షిప్‌యార్డ్, CGCL, MSTC లిమిటెడ్, ICICI జనరల్ ఇన్సూరెన్స్, SJVN టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. రిలయన్స్, ITC, నెస్లే, HDFC లైఫ్, సిప్లా, హీరో మోటో, భారతి ఎయిర్‌టెల్ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. మరోవైపు... HDFC బ్యాంక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇండియా ఎనర్జీ ఎక్స్ఛేంజ్, బంధన్ ఎస్ & పి, లోధా డెవలపర్స్, గ్రావిటా ఇండియా షేర్లు టాప్ లూజర్స్ లిస్ట్‌లో ఉన్నాయి. విప్రో, టాటా స్టీల్, హిందాల్కో, టాటా మోటార్స్, బజాజ్ ఆటో కూడా టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
నిఫ్టీలో... అదానీ పోర్ట్స్, HDFC లైఫ్, TCS, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ బలంగా ప్రారంభమయ్యాయి. HDFC బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు గణనీయంగా తగ్గాయి.
నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్, మెటల్, రియల్టీ ఇండెక్స్‌లు 1.5 శాతం నుంచి 2 శాతం వరకు పతనమయ్యాయి.
ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 860.27 పాయింట్లు లేదా 1.18% తగ్గి 72,268.51 దగ్గర; NSE నిఫ్టీ 243.55 పాయింట్లు లేదా 1.11% తగ్గి 21,788.75 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించడంలో ఆచితూచి అడుగులు వేయాలని US ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలెర్ మంగళవారం సూచించారు. వాల్ స్ట్రీట్ ఊహించిన దాని కంటే తక్కువ రేట్ కట్స్ ఉండొచ్చని సిగ్నల్ ఇచ్చారు. దీంతో USలో 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ 4 శాతానికి పైగా ఉంది. నిన్న, USలో S&P 500 0.37 శాతం, డౌ జోన్స్ 0.62 శాతం, నాస్‌డాక్ 0.19 శాతం పడిపోయాయి.
ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే.., చైనా Q4 GDP, రిటైల్ అమ్మకాలు, పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదార్లు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. హాంగ్ సెంగ్ 1.3 శాతం లోయర్ సైడ్‌లో ఉంది. కోస్పి 1.2 శాతం, ASX 200 0.2 శాతం క్షీణించగా, జపాన్ నికాయ్ 1.2 శాతం జంప్‌తో తన ర్యాలీని తిరిగి ప్రారంభించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి