Stock Market News Today in Telugu: బుధవారం నాటి దారుణమైన ఊచకోత తర్వాత, భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం, 14 మార్చి 2024) కొద్దిగా స్థిమితపడ్డాయి. ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రెండూ నెగెటివ్ సైడ్ నుంచి ప్రారంభమైనప్పటికీ, ఆ వెంటనే అప్‌ట్రెండ్‌లోకి మారాయి. ఈ రోజు మార్కెట్‌కి బయటి నుంచి కూడా మద్దతు లభించడం లేదు.
నిన్న (బుధవారం) మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది. సెన్సెక్స్ 906.07 పాయింట్లు (1.23 శాతం), నిఫ్టీ 338 పాయింట్లు (1.51 శాతం) జారిపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5 శాతం క్షీణించగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 4 శాతం, SME ఇండెక్స్ 6 శాతం పడిపోయాయి. ఇటీవలి కాలంలో మార్కెట్‌లో ఒక్కరోజులో ఇదే అతి పెద్ద పతనం. నిన్న ఒక్క రోజే, మదుపర్ల సంపద రూ.13 లక్షల కోట్లు ఆవిరైంది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (బుధవారం) 72,762 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 192 పాయింట్లు తగ్గి 72,570.10 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. బుధవారం 21,998 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 16 పాయింట్లు తగ్గి 21,982.55 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 5 నిమిషాల తర్వాత, ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 225 పాయింట్ల నష్టంతో 72,550 పాయింట్ల దిగువకు చేరుకుంది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 21,950 పాయింట్ల దగ్గరలో ఉంది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 0.6 శాతం క్షీణించినా, ఆ తర్వాత రీబౌండ్ అయ్యాయి, దాదాపు 1% పుంజుకున్నాయి.
ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 19 షేర్లు పతనంలో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ గరిష్టంగా ఒకటిన్నర శాతం నష్టాన్ని ఎదుర్కొంటోంది. టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వంటి షేర్లు కూడా తలా ఒక శాతం పైగా పడిపోయాయి. మరోవైపు.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అత్యధికంగా 1.43 శాతం లాభపడింది. NTPC షేరు కూడా 1 శాతం కంటే ఎక్కువ బలపడింది. కోల్ ఇండియా, హిందాల్కో, రిలయన్స్, BPCL కూడా టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి.
సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ బ్యాంక్ సూచీలు నష్టాలను పెంచాయి. ఇవి రెండు తలో 1 శాతం తగ్గాయి. చమురు & గ్యాస్ సూచీ 1 శాతం పైగా లాభపడింది.
సోమ్ డిస్టిలరీస్ స్టాక్ 7 శాతం ర్యాలీ చేసింది. స్ప్లిట్ లేదా షేర్ల సబ్-డివిజన్‌ను పరిశీలించడం కోసం ఈ కంపెనీ డైరెక్టర్లు ఏప్రిల్ 02న సమావేశం అవుతారు.
IPO ఇష్యూ ప్రైస్ కంటే డిస్కౌంట్‌తో గోపాల్ స్నాక్స్ షేర్లు లిస్ట్ అయ్యాయి. IPO సమయంలో ఒక్కో షేర్‌ను రూ.401 కు ఈ కంపెనీ జారీ చేసింది.
ఈ రోజు ఉదయం 10.20 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 65.29 పాయింట్లు లేదా 0.09% పెరిగి 72,827.18 దగ్గర; NSE నిఫ్టీ 34.75 పాయింట్లు లేదా 0.16% పెరిగి 22,032.45 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ASX200, నికాయ్ 0.35 శాతం వరకు క్షీణించగా, కోస్పి, హ్యాంగ్ సెంగ్, షాంఘై కాంపోజిట్ 0.5 శాతం వరకు పెరిగాయి. నిన్న, అమెరికాలో, S&P500 0.19 శాతం దిగువన ముగిసింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.54 శాతం నష్టపోయింది. వీటికి విరుద్ధంగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.1 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి