Seven Musical Notes: భారతీయ శాస్త్రీయ సంగీతంలో సప్త స్వరాలు పట్టుగొమ్మల్లాంటివి. ఇవి పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి ఉద్భవించాయి. స, రి, గ, మ, ప, ద, ని వీటిని సప్తస్వరాలు అంటారు.


స అంటే షడ్జమం. ఇది నెమలి క్రేంకారం నుంచి పుట్టింది.


రి అంటే రిషభం ఇది ఎద్దు రంకె నుంచి పుట్టింది.


గ అంటే గాంధర్వం ఇది మేక అరుపు నుంచి పుట్టింది.


మ అంటే మధ్యమం ఇది క్రౌంచ పక్షి కూత నుంచి పుట్టింది


ప అంటే పంచమం ఇది కోయిల కూత నుంచి పుట్టింది


ద అంటే ధైవతం ఇది గుర్రం సకిలింత నుంచి పుట్టింది


ని అంటే నిషాదం ఇది ఏనుగు ఘీంకారం నుంచి పుట్టింది.


సాధారణంగా ఒక రాగంలో ఐదు స్వరాలు ఉంటాయి. ఈ రాగాల కూర్పు వల్లనే భారతీయ సంగీతం ప్రపంచ సంగీతంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. స్వరాలకు ఆధారం శృతులు. శృతి అంటే ధ్వని విశేషం. సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీటికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం) కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది. ఇది భారతీయ శాస్త్రీయ సంగీతానికున్న ప్రత్యేకత.


స, రి, గ, మ, ప, ద, ని సప్త స్వరాలను ఆరోహణ, అవరోహణ క్రమంలో పాడుతారు. అంటే..తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి, ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అంటే.. మధ్యమ స్థాయి షడ్జం నుంచి తారా స్థాయి షడ్జం వరకు పాడటం. ఉదాహరణకు స రిగా మ ప దని స..ఇలాగన్నమాట.



ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి, తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అంటే తారా స్థాయి షడ్జం నుంచి మధ్యమ స్థాయి షడ్జం వరకు పాడటం. ఉదాహరణకు సని ద ప మగా రి స..ఇలాగన్నమాట.


శాస్త్రీయ సంగీతంలో సప్తస్వరాలను కోమల స్వరాలుగా పిలుస్తారు. అయితే వీటితో పాటూ తీవ్ర స్వరాలు కూడా ఉంటాయి. వీటిని వికృత స్వరాలు అని పిలుస్తారు. ఈ రెండూ కలిపి మొత్తం పన్నెండు స్వరాలు. వీటిలో 7 శుద్ధ స్వరాలుగా, 5 వికృత స్వరాలుగా విభజించారు.



భారతీయ సంప్రదాయంలోని అన్ని కళల్లాగే కర్ణాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల పక్షుల స్వరాలను నిశితంగా పరిశీలించటం వల్ల వాటి కూతలను అనుకరించటం వల్ల స్వరాలు ఏర్పడ్డాయని హిందూ శాస్త్రీయ గ్రంథాలు చెప్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో, ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరించే కొన్ని సంగీత స్వరాల నుంచి భారతీయ సంగీతం ఉద్భవించిందని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పుకొచ్చారు.