Stock Market News Today in Telugu: 2023 చివరి ట్రేడింగ్‌ సెషన్‌ను (శుక్రవారం, 29 డిసెంబర్‌ 2023) నష్టాలతో ముగించిన భారత స్టాక్‌ మార్కెట్లు, 2024 సంవత్సరం మొదటి ట్రేడింగ్‌ సెషన్‌లోనూ (సోమవారం, 01 జనవరి 2024) నిరాశపెట్టాయి. నూతన సంవత్సరం సందర్భంగా గ్లోబల్‌ మార్కెట్లు మూతబడి ఓవర్సీస్‌ నుంచి ఎలాంటి సిగ్నల్స్‌ లేకపోవడంతో, ఈ రోజు ప్రారంభంలో దేశీయ మార్కెట్లలో ఎలాంటి బలం కనిపించలేదు, ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ మాత్రం మరోమారు రికార్డ్‌ స్థాయికి చేరింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (శుక్రవారం, 29 డిసెంబర్‌ 2023) 72,240 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 17.50 పాయింట్లు క్షీణించి 72,222.76 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 21,731 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 5.50 పాయింట్ల స్వల్ప నష్టంతో 21725.90 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


బ్రాడర్‌ మార్కెట్లు మెరుగ్గా కనిపిస్తున్నాయి. BSE మిడ్‌ క్యాప్ 100 ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది, 137 పాయింట్లు లేదా 0.46 పెరుగుదలతో 46,319 స్థాయి వద్ద ట్రేడయింది. BSE స్మాల్‌ క్యాప్‌ సూచీ కూడా 0.46 శాతం వరకు పెరిగింది. 


డిసెంబర్‌లో సేల్స్‌ నంబర్లు + క్వార్టర్లీ సేల్స్‌ రిపోర్ట్‌ను ఆటో స్టాక్స్‌ నివేదిస్తాయి. కాబట్టి, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి, హీరో మోటోకార్ప్‌ సహా ఆటోమొబైల్ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉన్నాయి.


సెన్సెక్స్ షేర్ల చిత్రం
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో... 15 కంపెనీలు లాభపడగా, 15 కంపెనీలు క్షీణించాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో... టాటా మోటార్స్ 1.70 శాతం పెరుగుదలతో ట్రేడవుతోంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.75 శాతం లాభపడింది. SBI 0.66 శాతం, నెస్లే ఇండియా 0.59 శాతం, ITC 0.55 శాతం పెరిగాయి.


నిఫ్టీ షేర్ల పరిస్థితి
నిఫ్టీ 50 ప్యాక్‌లో... 27 స్టాక్స్‌ ట్రేడవుతుండగా, 22 క్షీణతలో ఉన్నాయి. ఒక్క స్టాక్‌ ఎలాంటి మార్పు లేకుండా ఉంది. BPCL, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్ టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. మరోవైపు.. భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, M&M, HUL, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్ లోయర్‌ సైడ్‌లో స్టార్ట్‌ అయ్యాయి.


బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ ట్రెండ్‌లోకి తిరిగి వచ్చింది, 18.40 పాయింట్ల లాభంతో 48.310 స్థాయి వద్ద కదులుతోంది.


ఈ రోజు ఉదయం 10.20 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 114.45 పాయింట్లు లేదా 0.16% తగ్గి 72,125.81 దగ్గర; NSE నిఫ్టీ 18.90 పాయింట్లు లేదా 0.08% తగ్గి 21,712.50 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
ప్రపంచమంతా 2024 కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్న నేపథ్యంలో చాలా ఓవర్సీస్‌ మార్కెట్లు సెలవు తీసుకున్నాయి. చైనా, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియాతో సహా ఆసియా మార్కెట్లు ఈ రోజు మూతబడ్డాయి. US, యూరోప్‌ మార్కెట్లు కూడా పని చేయవు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: 2024లో మీ లైఫ్‌ను మార్చేసే 14 ఫైనాన్షియల్‌ టిప్స్‌