Stock Market News Updates Today 06 Nov: అమెరికా నుంచి వస్తున్న ఎన్నికల ఫలితాల ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై కనిపిస్తోంది. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యే కచ్చితమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడవుతారంటూ న్యూయార్క్ టైమ్స్ స్పష్టమైన సూచనలు చేయడంతో నిన్న అమెరికన్ స్టాక్ మార్కెట్ దూసుకెళ్లింది. అమెరికన్ మార్కెట్లలో డౌ జోన్స్ ఫ్యూచర్స్ 560 పాయింట్ల లాభంతో ట్రేడయ్యాయి. S&P 500 సూచీ 1 శాతం పైగా లాభపడింది. నాస్‌డాక్ 1.43 శాతం లాభాల్లో క్లోజయింది. ఇది, భారతీయ స్టాక్ మార్కెట్ సహా అన్ని ఆసియా మార్కెట్లకు ఊపునిచ్చింది. ఈ రోజు (బుధవారం, 06 నవంబర్ 2024) భారత మార్కెట్లు బలంగా పుంజుకుంటున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..
గత సెషన్‌లో (మంగళవారం) 79,476 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 295 పాయింట్లు లేదా 0.37 శాతం పెరుగుదలతో 79,771.82 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. మంగళవారం 24,213 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 95 పాయింట్లు లేదా 0.39 శాతం జంప్‌తో 24,308.75 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
ఐటీ ఇండెక్స్‌లో భారీ పెరుగుదల
మార్కెట్ ప్రారంభ సమయంలో, ఐటీ ఇండెక్స్ 513 పాయింట్ల జంప్‌తో 40925 స్థాయిలో ట్రేడవుతోంది. ఇండెక్స్‌లోని షేర్లను పరిశీలిస్తే... హెచ్‌సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు అత్యధికంగా పరుగులు పెట్టాయి. ఇన్ఫోసిస్ కూడా బూమ్‌తో ట్రేడ్ చేస్తోంది.
దూసుకెళ్లిన బ్యాంక్ నిఫ్టీ
బ్యాంక్ నిఫ్టీ 233 పాయింట్లు లేదా 0.40 శాతం పెరుగుదలతో 52440 స్థాయికి చేరింది. . నిన్నటి మార్కెట్‌లో కూడా బ్యాంక్ నిఫ్టీ 992 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది. ఈ ఉదయం నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో బలమైన పెరుగుదల కనిపిస్తోంది.
సెక్టోరల్ ఇండెక్స్‌ల అప్‌డేషన్
సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో, నేడు, మెటల్ ఇండెక్స్ మాత్రమే ఎరుపు రంగులో ఉంది. ఐటీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో ఎక్కువ వృద్ధి కనిపిస్తోంది. వీటిలో, రియల్టీ ఇండెక్స్ 2 శాతానికి పైగా ట్రేడవుతుండగా, ఐటీ రంగంలో 1.24 శాతం పెరుగుదల నమోదైంది. ఆయిల్ మరియు గ్యాస్ రంగంలో 1.04 శాతం జంప్ వచ్చింది.
ఉదయం 11.06 గంటలకు, సెన్సెక్స్ 457.66 పాయింట్లు లేదా 0.58% పెరిగి 79,934.30 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి నిఫ్టీ 144.30 పాయింట్లు లేదా 0.60% పెరిగి 24,357.60 దగ్గర ట్రేడవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ