Adani Group Shares Today: అదానీ కంపెనీల షేర్లు ఉన్న వాళ్లు ఇప్పుడు అదృష్టవంతులు. గత వారంలో (04-08 డిసెంబర్‌ 2023) అదానీ బుల్స్‌ చెలరేగాయి, 65% వరకు ర్యాలీ చేశాయి. ఈ గ్రూప్‌లోని రెండు స్టాక్స్‌ (Adani Group Stocks) కేవలం ఐదు రోజుల్లోనే రూ.19,500 కోట్లకు పైగా లాభాలు ఆర్జించాయి.


అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ
గత వారం పిరియడ్‌లో, అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (total market capitalization of listed Adani companies) రూ. 3.14 లక్షల కోట్లు పెరిగి రూ. 14.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ  క్యాలెండర్ సంవత్సరంలోనే (2023) అదానీ గ్రూప్‌ స్టాక్స్‌కు ఇది అత్యత్తుమ వారపు లాభం (weekly gain).  


2023 జనవరి 24న, అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, అమెరికన్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ‍‌(Hindenburg Research) ఒక రిపోర్ట్‌ విడుదల చేసింది. అప్పటి నుంచి కేవలం నెల రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ దాదాపు 70 శాతం పతనమైంది. ఆ తర్వాత అమెరికాకే చెందిన GQG పార్ట్‌నర్స్‌ (GQG Partners) ఎంట్రీతో మళ్లీ దశ తిరిగింది.  హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ రిపోర్ట్‌ విడుదలకు ఒక రోజు ముందు అదానీ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 19.2 లక్షల కోట్లుగా ఉంది. దీనితో పోలిస్తే గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ క్యాప్‌ ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. 


గత వారంలో, మొత్తం 10 అదానీ స్టాక్స్‌ రెండంకెల లాభాల చూపించాయి. అదానీ టోటల్ గ్యాస్ తన పెట్టుబడిదార్ల డబ్బును దాదాపు 65% పెంచింది. అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా ఇన్వెస్టర్లకు 51% గెయిన్స్‌ ఇచ్చింది. గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాని షేర్లు 19% పెరగ్గా, గ్రూప్‌ ATMగా పిలిచే అదానీ పోర్ట్స్ షేర్లు 24% పెరిగాయి.


ఎన్నికల తర్వాత బుల్‌ ర్యాలీ
ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయం తర్వాత అదానీ స్టాక్స్‌లో అద్భుతమైన బుల్‌ రన్‌ను మార్కెట్‌ చూసింది. శ్రీలంకలో ఒక కంటైనర్ టెర్మినల్ కోసం ఆర్థిక సాయం చేయడానికి యూఎస్‌ ప్రభుత్వ సంస్థ ముందుకు రావడంతో పెట్టుబడిదార్ల విశ్వాసం మరింత పెరిగింది.


అదానీ స్టాక్స్‌లో ఇంత భారీ ర్యాలీ తర్వాత కూడా, అదానీ పోర్ట్స్‌, అంబుజా సిమెంట్స్‌ను IIFL సెక్యూరిటీస్‌ బుల్లిష్‌గా చూస్తోంది. 


అదానీ పోర్ట్స్‌కు ఈ బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్‌ రూ.1,210. ఈ రోజు (సోమవారం, 11 డిసెంబర్‌ 2023) ఉదయం 11.30 గంటల సమయానికి, ఈ కంపెనీ షేర్లు రూ.17.05 లేదా 1.67% పెరిగి రూ.1,040 వద్ద ఉన్నాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: జర్రున జారుతున్న గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి