Rupee at All-Time Low Again:  భారత కరెన్సీ విలువ మళ్లీ ఘోరమైన రికార్డ్‌ మూటగట్టుకుంది. ఈ రోజు ట్రేడ్‌లో (శుక్రవారం, 24 నవంబర్‌ 2024), US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 83.36 స్థాయికి పడిపోయింది. ఇది, ఇప్పటివరకు ఇండియన్‌ రుపీకి కనిష్ట స్థాయి/ జీవిత కాల కనిష్ట విలువ (Rupee Hits All-Time Low). 


నిన్న (గురువారం), అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 83.34 వద్ద ముగిసింది. ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లోనే రెండు పైసలు పడిపోయిన రూపాయి, ఆల్‌ టైమ్ లో లెవల్‌కు జారిపోయింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో (Indian stock market) నెగెటివ్‌ సెంటిమెంట్‌, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FII) అమ్మకాలు కారణాలు దీనికి కారణంగా మారాయి.


ఈ రోజు రూపాయి ట్రేడ్‌
ఇంటర్‌బ్యాంక్ ఫారిన్‌ కరెన్సీ మార్కెట్‌లో, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 83.33 వద్ద ప్రారంభమైంది. ఓపెనింగ్‌ ట్రేడ్‌లోనే రెండు పైసలు పతనమై రూ. 83.36కి చేరుకుంది. మరోవైపు, ప్రపంచంలోని ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.12 శాతం క్షీణించి 103.79 వద్దకు చేరుకుంది.


కొన్ని రోజులుగా కరెన్సీలో రూపాయి పతనం కొనసాగుతోంది. నిన్న (నవంబర్ 23), గత సోమవారం ‍(నవంబర్ 20) రోజు, అంతకు ముందు నవంబర్ 10న కూడా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ (Value of Rupee against US Dollar) రూ. 83.34 స్థాయి వద్ద కనిపించింది. నవంబర్ 10న ట్రేడింగ్‌లో రూపాయి విలువ మరింత బలహీనపడింది, ఒక సమయంలో 83.42 వరకు క్షీణించింది.


రూపాయిపై ప్రభావం చూపుతున్న మార్కెట్ శక్తులు
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ‍‌(Brent Crude), ఈ రోజు బ్యారెల్‌కు 0.06 శాతం తగ్గి 81.37 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) నిన్న రూ. 255.53 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. అయినా, ఈ రోజు ట్రేడ్‌లో అమ్మకాల వైపు ఎక్కువగా చూస్తున్నారు.


స్టాక్‌ మార్కెట్‌ ట్రేడ్‌ (Stock market today)
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి NSE నిఫ్టీ 6.10 పాయింట్లు లేదా 0.031% నష్టంతో 19,795.90 వద్ద; BSE సెన్సెక్స్‌ 40.12 పాయింట్లు లేదా 0.061% తగ్గి 65,977.69 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.


రూపాయిపై గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఆసక్తికర వ్యాఖ్య
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI), ఇటీవల, భారతీయ రూపాయికి సంబంధించి భారత ప్రభుత్వానికి ఒక ఆసక్తికరమైన సలహా ఇచ్చింది. భారత రూపాయిని బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం కాదని ఈ గ్లోబల్ థింక్ ట్యాంక్ అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్న దశలో రూపాయి బలపడితే అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని GTRI చెప్పింది. ప్రస్తుత కాలంలో, మధ్య తరగతి ఆదాయ దేశంగా మారేందుకు భారతదేశం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని జీటీఆర్‌ఐ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ స్థిరపడిన తర్వాతే రూపాయిని బలోపేతం చేయడం గురించి భారత్ ఆలోచించాలని సూచించింది. అప్పటి వరకు ప్రపంచ వాణిజ్యంలో రూపాయి వినియోగాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే భారతదేశం ప్రయత్నాలు చేయాలని చెప్పింది.


మరో ఆసక్తికర కథనం: కొండెక్కి దిగనంటున్న గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి