Multibagger Energy Sector Stock: స్టాక్ మార్కెట్‌లో ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి. మార్కెట్ ఒడుదొడుకులను బట్టి ఇన్వెస్టర్ జాతకం మారిపోతుంది. కొన్నిసార్లు మల్టీబ్యాగర్ రిటర్న్స్ వస్తే, మరికొన్నిసార్లు ఇన్వెస్ట్‌మెంట్ సున్నాకు చేరుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.
స్మాల్ క్యాప్ కంపెనీ అయిన డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండియా) [Dolphin Offshore Enterprises (India)] మాత్రం తన ఇన్వెస్టర్లను నిరాశపరచలేదు, సిరులు కురిపించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ & బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE & BSE) ఈ కంపెనీ షేర్లు ట్రేడ్ అవుతున్నాయి.
డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్‌ప్రైజెస్, ఎనర్జీ సెక్టార్‌లోని కంపెనీ. అండర్‌వాటర్ సర్వీసెస్ ద్వారా దేశీయ ఆయిల్ & గ్యాస్ రంగంలో (Indian oil and gas sector) బిజినెస్ చేస్తోంది. దీనిని 1979లో స్థాపించారు. ముంబైలో హెడ్ క్వార్టర్‌గా ఈ కంపెనీ పని చేస్తోంది.
అప్పర్ సర్క్యూట్ కొడుతున్న డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు
డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండియా) షేర్లు కొంతకాలంగా అప్పర్ సర్క్యూట్‌ను కొడుతూ, ఎప్పటికప్పుడు కొత్త 52-వారాల గరిష్టాలను (52W-High) నమోదు చేస్తూ వస్తున్నాయి. ఈ రోజు (గురువారం, 23 నవంబర్ 2023) కూడా, కొత్త 52-వారాల గరిష్ట స్థాయి రూ. 797.60 వద్ద అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి. స్టాక్ స్ల్పిట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు డిసెంబర్ 07, 2023న సమావేశం అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్టాక్‌లో తాజా బజ్‌కు ఇదే కారణం.
మల్టీబ్యాగర్ స్టాక్
డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండియా) షేర్లు గత ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 596.81% మల్టీబ్యాగర్ రాబడిని అందించాయి. గత నెల రోజుల్లోనే 54% పైగా పెరిగాయి.
Q2 FY24 చివరి నాటికి, ఈ కంపెనీలో ప్రమోటర్ వాటా 74.99%గా ఉంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FIIలు) వాటా 21.05%, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (DIIలు) వాటా 1.58%, పబ్లిక్ వాటా 2.38%గా ఉంది.
2023 జూన్ క్వార్టర్‌లోని కంపెనీ ఆదాయం రూ.0.69 కోట్ల నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5.44 కోట్లకు చేరుకుంది. నికర లాభం Q1 FY24లోని రూ.0.13 కోట్లతో పోలిస్తే Q2 FY24లో రూ.3.53 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండియా) వెల్లడించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: దుబాయ్‌లో మారిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే