Foreign Exchange Reserves in India in 2023: భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 600 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒక వారంలో తగ్గినా, మరుసటి వారంలో పుంజుకుంటున్నాయి. 2023 నవంబర్ 17వ తేదీతో ముగిసిన వారానికి, భారత విదేశీ మారక నిల్వలు 5.077 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో, ప్రస్తుతం భారత్‌ వద్ద ఉన్న మొత్తం విదేశీ ద్రవ్యం నిల్వలు 595.397 బిలియన్ డాలర్లకు (India's Forex Reserves) చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం తాజా గణాంకాలను వెల్లడించింది.


అంతకుముందు, 2023 నవంబర్ 10వ తేదీతో ముగిసిన వారానికి ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్‌ 462 మిలియన్ డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.


ఆర్‌బీఐ విడుదల చేసిన వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ ప్రకారం, విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 4.39 బిలియన్ డాలర్లు పెరిగి 526.39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 


పెరిగిన బంగారం నిల్వలు


2023 నవంబర్ 17తో ముగిసిన వారంలో ఆర్‌బీఐ దగ్గర బంగారం నిల్వలు (Gold reserves In India) పెరిగాయి. ఆర్‌బీఐ గోల్డ్‌ ఛెస్ట్‌ 527 మిలియన్ డాలర్లు పెరిగి 46.04 బిలియన్ డాలర్లకు చేరుకుంది. SDRs (Special Drawing Rights) 120 మిలియన్‌ డాలర్ల వృద్ధితో 18.13 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌లో (IMF) రిజర్వ్‌ పొజిషన్ కూడా పెరిగింది. IMFలో ఇండియా డిపాజిట్ చేసిన నిల్వలు 42 మిలియన్ డాలర్లు జంప్‌ చేసి 4.83 బిలియన్ డాలర్లకు పెరిగాయి.


ఆల్ టైమ్ హై లెవెల్ ఇది


భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. ఆ తర్వాత RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని అర్ధం.


పడిపోయిన రూపాయి విలువ (Indian Rupee Value)


శుక్రవారం (24 నవంబర్‌ 2023), US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ (dollar to rupee exchange rate) 83.3675 వద్ద, రికార్డ్‌ స్థాయిలో ముగిసింది. ఆసియా దేశాల కరెన్సీల్లో బలహీనత, విదేశీ బ్యాంకుల నుంచి డాలర్ డిమాండ్ కారణంగా రూపాయి బలహీనపడింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


మరో ఆసక్తికర కథనం: క్రెడిట్‌ కార్డ్‌తో కొనిపడేసిన జనం - అక్టోబర్‌లో రూ.లక్షల కోట్ల షాపింగ్‌