Foreign Exchange Reserves in India in 2023: భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు నాలుగు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ వారంలో 6 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 600 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటాయి. 


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), విదేశీ మారక నిల్వల గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. RBI డేటా ప్రకారం, 01 డిసెంబర్ 2023తో ముగిసిన వారంలో, ఫారెక్స్ నిల్వలు (India's Forex Reserves) 6.10 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీనికి ముందు వారంలోని 597.395 బిలియన్ డాలర్ల నుంచి 604.04 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందాయి. ఫారెక్స్ నిల్వల్లో పెరుగుదల కనిపించడం ఇది వరుసగా మూడో వారం.


భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు ‍‌(Forex reserves all-time high record) చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. 


ఆర్‌బీఐ విడుదల చేసిన వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ ప్రకారం, విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) కూడా భారీగా పెరిగాయి. FCAs 5.07 బిలియన్ డాలర్లు పెరిగి 533.61 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 


పెరిగిన బంగారం నిల్వలు
 01 డిసెంబర్ 2023తో ముగిసిన వారంలో ఆర్‌బీఐ బంగారం నిల్వలు కూడా పెరిగాయి. ఆర్‌బీఐ గోల్డ్‌ ఛెస్ట్‌ (Gold reserves In India) 991 మిలియన్ డాలర్లు పెరిగి 47.32 బిలియన్ డాలర్లుగా ఉంది. SDRs (Special Drawing Rights) 32 మిలియన్ డాలర్ల వృద్ధితో 18.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌లో (IMF) రిజర్వ్‌ పొజిషన్ కూడా పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత్‌ జమ చేసిన నిల్వలు 5 బిలియన్ డాలర్లు పెరిగి 4.85 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.


పడిపోయిన రూపాయి విలువ (Indian Rupee Value)
శుక్రవారం (08 డిసెంబర్ 2023‌) US డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ (dollar to rupee exchange rate) 1 పైసా బలహీనతతో రూ. 83.38 వద్ద ముగిసింది.


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆదా అవుతాయి. ప్రభుత్వ చమురు కంపెనీలకు ముడి చమురును కొనుగోలు చేయడానికి తక్కువ డాలర్లు అవసరం అవుతాయి, విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర (Crude oil price) బ్యారెల్‌కు దాదాపు 75 డాలర్లకు పడిపోయింది.


ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని అర్ధం.


మరో ఆసక్తికర కథనం: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి