Adani Stocks Update Today: కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్‌లో స్టెల్లార్‌ ర్యాలీ కొనసాగుతోంది. దలాల్ స్ట్రీట్‌లో ఏరోజుకారోజు సూపర్‌ రికార్డులు, బంపర్ లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ షేర్లు మార్కెట్లో సృష్టించిన సందడి ఎక్కువగా ఫోకస్‌లోకి వచ్చింది.


రూ.14 లక్షల కోట్లకు చేరిన అదానీ కంపెనీల మార్కెట్ క్యాప్ (Market Capitalization of Adani Group Stocks) 
అదానీ గ్రూప్‌లోని చెందిన అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.13.91 లక్షల కోట్లకు (ఉదయం 10 గంటల వరకు) పెరిగింది. నిన్నటి ‍‌‍‌‍‌‍‌(మంగళవారం) ట్రేడింగ్ సెషన్‌లో అదానీ కంపెనీల ఎం-క్యాప్‌ భారీగా, దాదాపు రూ. 1.92 లక్షల కోట్లు పెరిగింది. మంగళవారం కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో లాక్‌ అయ్యాయి, కొత్త 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. సోమవారం రోజున (డిసెంబరు 4) అదానీ సంస్థల మార్కెట్ క్యాప్ రూ. 11.98 లక్షల కోట్లుకు చేరింది.


అదానీ షేర్ల చిత్రం (ఉదయం 10 గంటల వరకు)
మార్కెట్ క్యాప్‌ విషయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ అగ్రస్థానంలో ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్‌ ధర (Adani Enterprises share price today) ఈ రోజు రూ.120.65 పెరిగి రూ.3,080 స్థాయి వద్ద ఉంది. ఆ సమయానికి, గరిష్టంగా రూ.3,154.55 స్థాయిని చూసింది, నిన్నటి ముగింపు రూ.2959.35 నుంచి రూ.195 లాభపడింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.3.43 లక్షల కోట్లకు చేరుకుంది, గ్రూప్‌ స్టాక్స్‌లో దీనిదే టాప్‌ ప్లేస్‌.


తొలి గంటలో, అదానీ గ్రీన్ ఎనర్జీ స్క్రిప్‌ ‍‌(Adani Green Energy share price today) రూ.1608 వద్ద గరిష్ట స్థాయి చేరింది. ఈ కౌంటర్‌ నిన్న రూ.1348 వద్ద ముగిసింది. ఈ లెక్కన, షేర్ ధర ఇంట్రాడేలో 19.28 శాతం జంప్‌ను చూసింది, ఈ రోజు కూడా అదానీ గ్రూప్‌లో టాప్ గెయినర్‌గా నిలిచింది. దీని మార్కెట్ క్యాప్ రూ.2.47 లక్షల కోట్లకు చేరింది.


అదానీ పోర్ట్స్ అండ్‌ సెజ్ షేర్‌ ధర (Adani Ports share price today) నిన్న రూ.1013 వద్ద ముగిసింది, ఈ రోజు రూ.1045 వద్ద ప్రారంభైంది. ఉదయం 10 గంటల సమయానికి 3.10 శాతం జంప్‌తో రూ.1044.50 వద్ద కొనసాగుతోంది. దీని మార్కెట్ క్యాప్ రూ.2.25 లక్షల కోట్లు.


అదానీ పవర్ షేర్లు రూ.569.75 (+5.87%) వద్ద; అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.1,209.90 (+11.57%) వద్ద; అదానీ విల్మార్ రూ.401.30 (+5.42%) వద్ద; అదానీ టోటల్ గ్యాస్ రూ.1,014.00 (+15.51%) వద్ద; NDTV రూ.287.75 (+7.91%) వద్ద; అంబుజా సిమెంట్ రూ.512.75 (+0.73%) వద్ద ఉన్నాయి.


అదానీ ప్యాక్‌లో పడిపోయిన ఏకైక స్టాక్‌
ఈ రోజు ACC షేర్లు క్షీణించాయి. అదానీ గ్రూప్‌ లిస్టెడ్ కంపెనీల్లో, ప్రస్తుతం నష్టాల్లో ఉన్న స్టాక్‌ ఇదే. ఉదయం 10 గంటల సమయానికి ACC షేర్లు దాదాపు ఒకటిన్నర శాతం తగ్గాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయా, తగ్గుతాయా?, ఆర్‌బీఐ మీటింగ్‌ ప్రారంభం