Stock Market Holiday: BSE మార్కెట్ హాలిడే క్యాలెండర్ ప్రకారం, మహారాష్ట్ర దినోత్సవం (Maharashtra Day) కారణంగా ఈక్విటీ మార్కెట్లకు ఇవాళ (సోమవారం, 01 మే 2023) సెలవు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్‌లో ఇవాళ ట్రేడ్‌ జరగదు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఉదయం సెషన్‌కు కూడా ఉండదు, సాయంత్రం సెషన్‌లో, అంటే సాయంత్రం 5 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.


ఇది సెటిల్‌మెంట్ సెలవు రోజు కూడా కాబట్టి... ఏప్రిల్ 28న కమోడిటీ డెరివేటివ్స్‌లోని ట్రేడ్స్‌ లేదా పొజిషన్ల నుంచి వచ్చే లాభాలు కమోడిటీ ఖాతా బ్యాలెన్స్‌లో క్రెడిట్‌ కావు, ఎగ్జిటింగ్ ఆప్షన్ పొజిషన్‌ల నుంచి వచ్చే క్రెడిట్‌లు కూడా ఉండవు.


బెంచ్‌మార్క్ సూచీలు గత వారం 2% పైగా లాభపడడం ద్వారా డౌన్‌ ట్రెండ్‌ను ముగించాయి. నాలుగో త్రైమాసిక ఫలితాలు & ప్రపంచ పోకడలను ఇన్వెస్టర్లు ట్రాక్ చేస్తుంటారు కాబట్టి, ఈ ర్యాలీ కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


మిడ్ & స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌
మార్చి కనిష్ట స్థాయి నుంచి కనిపిస్తున్న ప్రస్తుత ర్యాలీ గత ఐదు నెలల కాలంలోనే అతి పెద్దదని బ్రోకరేజ్‌ ICICI డైరెక్ట్ చెబుతోంది. గత నాలుగు నెలల 'ఫాలింగ్‌ ఛానెల్' ప్యాట్రన్‌ను (falling channel pattern) నిఫ్టీ ఇండెక్స్ బ్రేక్‌ చేసిందని, అప్‌ట్రెండ్‌ పునఃప్రారంభానికి ఇది గుర్తని తెలిపింది. ఈ అప్‌ట్రెండ్ కొనసాగితే.. మే నెలలో మిడ్ & స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ మంచి జోరు చూపిస్తాయని బ్రోకరేజ్ అంచనా వేసింది. 


చరిత్రలోకి చూస్తే.. గత రెండు దశాబ్దాల కాలంలో, మే నెలలో సగం సమయం అల్లకల్లోలంగా ఉంది. ఎంత ఒత్తిడి ఉన్నా, 83% సందర్భాల్లో, క్యాలెండర్ సంవత్సరం చివరి నాటికి సగటున రెండంకెల రాబడిని మే నెల తెచ్చి ఇచ్చిందని చరిత్ర చెబుతోంది.


వచ్చే వారం కీలకం
ఈ వారంలో US ఫెడ్, ECB పాలసీ సమావేశాలు వరుసగా ఉన్నందున ఈ వారం చాలా కీలకం. ఫెడ్ తన పాలసీ రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని మార్కెట్‌ భావిస్తోంది. దీంతోపాటు.. US, చైనా, భారతదేశ PMI డేటాపై కూడా మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది.


"మొత్తంగా చూస్తే, మార్కెట్‌లో సానుకూల దృక్పథం ఉంది. నిఫ్టీ 18100 కంటే పైన ముగిస్తే, 18370 వరకు ర్యాలీ చేయవచ్చు. అక్కడ, వీక్లీ అప్పర్‌ బోలింగర్ బ్యాండ్ రూపంలో రెసిస్టెన్స్‌ ఉంటుంది" - షేర్‌ఖాన్‌


మొత్తం క్యాలెండర్ సంవత్సరంలో, మార్కెట్‌లకు 2023లో 15 వార్షిక సెలవులు ఉన్నాయి. మే 1వ తేదీ సెలవు కాక, ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో ఇంకా 8 సెలవులు ఉన్నాయి.


2023 సంవత్సరంలో మిగిలివున్న స్టాక్ మార్కెట్‌ సెలవులు:


మే 1, 2023 - మహారాష్ట్ర దినోత్సవం కారణంగా సెలవు
జూన్ 28, 2023 - బక్రా ఈద్ కారణంగా సెలవు
ఆగస్ట్ 15, 2023 - స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు
సెప్టెంబర్ 19, 2023 - గణేష్ చతుర్థి కారణంగా సెలవు
అక్టోబర్ 2, 2023 - గాంధీ జయంతి కారణంగా సెలవు
అక్టోబర్ 24, 2023 - దసరా కారణంగా సెలవు
నవంబర్ 14, 2023 - దీపావళి కారణంగా సెలవు
నవంబర్ 27, 2023 - గురునానక్ జయంతి కారణంగా సెలవు
డిసెంబర్ 25, 2023 - క్రిస్మస్ కారణంగా సెలవు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.