Stock Market:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఇచ్చిన షాక్ నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఇంకా కోలుకోలేదు! బెంచ్‌మార్క్ సూచీలు ఒక్కసారిగా క్రాష్ అవ్వడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు తమ లాంగ్ పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు. అందుకే సోమవారం మార్కెట్లు ఎలా ఉంటాయోనన్న ఆందోళన మొదలైంది! మొత్తంగా ఈ వారం జరిగే కొన్ని ఈవెంట్ల పైనే ఈక్విటీ మార్కెట్ల భవితవ్యం ఆధారపడనుంది.
టెస్లా, ఇతర టెక్ కంపెనీల షేర్లు క్రాష్ అవ్వడంతో అమెరికాలోని నాస్‌డాక్ సూచీ పతనమైంది. ఇది నెగెటివ్ సెంటిమెంటుకు దారితీయడంతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఓవర్‌గా రియాక్ట్ అయ్యాయి. ఐటీ కంపెనీల షేర్లను మదుపర్లు తెగనమ్మడంతో నిఫ్టీ ఏకంగా 234 పాయింట్లు నష్టపోయి 19,745 వద్ద నిలిచింది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ అయితే ఇంట్రాడేలో 1000 పాయింట్ల వరకు పడిపోయి 800 నష్టంతో ముగించింది. అమెరికా ఫెడ్, క్యూ1 ఎర్నింగ్స్ వంటివి ఈ వారం మార్కెట్లో ప్రభావం చూపించనున్నాయి.
చివరి గురువారం నాస్‌డాక్ పడిపోయింది. కంపెనీల ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. మూడు అతిపెద్ద సూచీల్లో రెండు ఫ్లాట్‌గా ముగిశాయి. సోమవారం భారత మార్కెట్లు మొదలవ్వగానే ఈ సంకేతాలకు ప్రతిస్పందిస్తాయి. గిఫ్ట్‌నిఫ్టీ సూచీ ఆ రోజుకు మార్గదర్శనం చేయనుంది. సోమవారం అమెరికా, బ్రిటన్, ఐరోపా కూటమి పీఎంఐ డేటా విడుదల అవుతుంది. జీడీపీ, నిరుద్యోగం డేటా వస్తుంది. ఫెడ్, ఐరోపా సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల వంటివి ప్రభావం చూపిస్తాయి.
టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్, ఎల్‌టీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి పెద్ద కంపెనీలు జూన్ త్రైమాసికం ఫలితాలను ఈ వారమే విడుదల చేస్తాయి. కోకా కోలా, బోయింగ్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, వీసా, మెటా, మాస్టర్ కార్డ్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, మెర్మెస్, అస్ట్రాజెనికా వంటి అంతర్జాతీయ కంపెనీల ఫలితాలూ వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంకు, యెస్ బ్యాంకు ఫలితాలూ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి.
కేఈసీ ఇంటర్నేషనల్, కిర్లోస్కర్ బ్రదర్స్, శ్రీ సిమెంట్, ఆటోమోటివ్ యాక్సెల్స్, ప్రతాప్ స్నాక్స్ వంటి కంపెనీల కార్పొరేట్ యాక్షన్స్ ఈ వారంలో ఉన్నాయి. టెక్నికల్ అనాలసిస్ ప్రకారం సపోర్ట్, రెసిస్టెంన్స్ వంటివి కీలకం అవుతాయి. శుక్రవారం ఫారిన్ ఇన్వెస్టర్లు రూ.1998 కోట్ల మేర సొమ్ము చేసుకున్నారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1290 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. ఈ వారం వీరెలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. క్రూడాయిల్, డాలర్‌తో రూపాయి మారకం, బంగారం ధరలు, బాండ్ యీల్డుల వంటివి ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయి.
Also Read: మీ డబ్బును పెంచే ఎస్‌బీఐ స్పెషల్ స్కీమ్, ఆగస్టు 15 వరకే అవకాశం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial