SBI Amrit Kalash Scheme: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొన్ని నెలలుగా ఒక ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని అమలు చేస్తోంది. గత నెలాఖరుతో ఈ స్కీమ్‌ (జూన్ 30, 2023‌) గడువు ముగిసింది. అయితే, డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ఆ పథకాన్ని రీ లాంచ్‌ చేసింది.


ఎస్‌బీఐ రీ లాంచ్‌ చేసిన స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ పేరు 'అమృత్‌ కలశ్‌' (SBI Amrit Kalash Scheme). మొదట, ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు ఈ స్కీమ్‌ను స్టేట్‌ బ్యాంక్‌ నిర్వహించింది, డిపాజిట్లు స్వీకరించింది. మార్చి 31తో గడువు ముగిసినా, ఆ తర్వాత, ఏప్రిల్ 12 నుంచి రీస్టార్ట్‌ చేసింది, జూన్‌ 30 వరకు కొనసాగించింది. ఆ తర్వాత, లాస్ట్‌ డేట్‌ను మరోసారి పొడిగించింది, 2023 ఆగస్టు 15ని చివరి గడువుగా ఖరారు చేసింది.


ఎస్‌బీఐ 'అమృత్‌ కలశ్‌' స్కీమ్ మరో మూడు వారాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఇది ఒక పరిమిత కాల ఆఫర్‌. షార్ట్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం సంపాదించాలని మీరు ప్లాన్‌ చేస్తుంటే, ఈ FD స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. 


అమృత్‌ కలశ్‌ ఫథకంపై వడ్డీ రేటు
SBI అమృత్‌ కలశ్‌ పథకం కాల వ్యవధి 400 రోజులు. ఈ డిపాజిట్‌ పథకంలో పెట్టుబడి పెట్టే సీనియర్‌ సిటిజన్లకు (60 సంవత్సరాలు లేదా ఆ వయస్సు దాటిన వాళ్లు) ఏటా 7.6 శాతం వడ్డీని స్టేట్‌ బ్యాంక్‌ చెల్లిస్తుంది. సాధారణ పౌరులకు (60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వాళ్లు) ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ జమ చేస్తుంది. ఎస్‌బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక శాతం వడ్డీరేటు అదనంగా ఆఫర్‌ చేస్తోంది.


వడ్డీ రేటుపై ఒక ఉదాహరణను పరిశీలిస్తే... ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌లో ఒక సీనియర్‌ సిటిజన్‌ ఒక 5 లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే, 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం 400 రోజులకు రూ. 43,000 వడ్డీ వస్తుంది. రూ. 5 లక్షల డిపాజిట్‌కు 7.6 శాతం వడ్డీ రేటు ప్రకారం, ఒక సాధారణ పౌరుడికి లభించే వడ్డీ మొత్తం 40,085 రూపాయలు.


అమృత్‌ కలశ్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
మీకు దగ్గరలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు మీరు స్వయంగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లేంత సమయం మీకు లేకపోతే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్‌ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.


ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే సదుపాయం ఉంది. ఈ డిపాజిట్‌ను మీద బ్యాంక్‌ లోన్‌ కూడా వస్తుంది.


అమృత్‌ కలశ్‌ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఇన్‌కం టాక్స్‌ రూల్స్‌ ప్రకారం TDS కట్‌ అవుతుంది. ఇలా కట్‌ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 


ఎవరు ప్రయోజనం పొందుతారు?
రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా డిపాజిట్‌ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్‌ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.


మరో ఆసక్తికర కథనం: పెరిగిన పసిడి వెలుగు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial