వరుసగా నాలుగు సెషన్లలో దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు గురువారం ఘోరంగా పతనమయ్యాయి! మార్కెట్లపై ఒక్కసారిగా బేర్స్ ఆధిపత్యం చెలాయించడంతో మదుపర్లు విలవిల్లాడారు. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలోని పెద్ద కంపెనీల మార్కెట్ విలువ అనూహ్యంగా తగ్గిపోయింది. నిఫ్టీలోని టాప్-5 కంపెనీల విలువ ఏకంగా రూ.లక్ష కోట్ల వరకు ఆవిరైంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 3 శాతం వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.94,000 కోట్ల మేర హరించుకుపోయింది. టెలికాం నుంచి చమురు వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే రియలన్స్ ఇండస్ట్రీస్‌కు నిఫ్టీలో ఎక్కువ వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ షేరు 2 శాతం పడిపోవడంతో రిలయన్స్ మార్కెట్ విలువ రూ.33,000 కోట్లు తగ్గిపోయింది.
సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ల ధర 2 శాతం తగ్గడంతో మార్కెట్ విలువలో రూ.19,000 కోట్లు కోత పడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సైతం 2 శాతం పడిపోవడంతో రూ.19000 కోట్ల మేర సంపద తగ్గిపోయింది. ఐసీఐసీఐ మార్కెట్ విలు రూ.10,000 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.13,000 కోట్లు తగ్గిపోయింది. మొత్తంగా స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఇన్వెస్టర్ సంపద రూ.2.54 లక్షల కోట్లు హాం ఫట్! అయింది. ఫలితంగా ఇంట్రాడేలో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.270 లక్షల కోట్లకు తగ్గిపోయింది.
ఒకవైపు ఒమిక్రాన్‌తో మూడో వేవ్ భయాలు పెరగడం, అమెరికా ఫెడ్ డిసెంబర్ 14-15 సమావేశాల్లోని సమాచారం బయటకు రావడమే ఈ పతనానికి కారణాలుగా తెలుస్తోంది. అనుకున్న సమయం కన్నా ముందుగానే యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లను సవరించాలని నిర్ణయించిందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఫారిన్, డొమస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కదలికలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది.
ఇక బెంచ్‌మార్క్ సూచీల విషయానికి వస్తే..
క్రితం రోజు 60,223 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,731 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 11 గంటల సమయంలో 59,300 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. దాదాపు 825 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త కొనుగోళ్లు పెరగడంతో పుంజుకున్న సూచీ 59,781 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 621 పాయింట్ల నష్టంతో 59,601 వద్ద ముగిసింది.
బుధవారం 17,925 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,768 వద్ద మొదలైంది. 17,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో 230కి పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త కోలుకొని 17,979 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 179 పాయింట్ల నష్టంతో 17,745 వద్ద ముగిసింది.