Stock Market Closing On 18 October 2023: ఈ రోజు (బుధవారం, 18 అక్టోబర్‌ 2023) ట్రేడింగ్ సెషన్ ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌ను బాగా నిరాశపరిచింది. ఉదయం మార్కెట్‌ కాస్త పచ్చగా ఓపెన్‌ అయినా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తత, క్రూడాయిల్ ధరల విపరీతమైన పెరుగుదలతో భారీగా అమ్మకాల్లోకి వెళ్లాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి BSE సెన్సెక్స్ 551 పాయింట్ల పతనంతో 66,000 మార్క్‌ దిగువకు పడిపోయింది. NSE నిఫ్టీ 140 పాయింట్ల పతనమైంది. 


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత ముదిరి మొత్తం ప్రాంతీయ సంక్షోభంగా మారుతుందేమోనన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇదే జరిగితే, ముడి చమురు ఉత్పత్తి & సరఫరా దెబ్బతింటాయి, చమురు రేట్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవడానికి కేంద్ర బ్యాంకులు చేసే ప్రయత్నాలకు ఇది అడ్డు పడుతుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిని కూడా మరింత స్లో చేసే ఛాన్స్‌ ఉంది. 


మధ్యాహ్నం 3:55 గంటల ప్రాంతంలో బ్రెంట్ క్రూడ్ 2.67 శాతం పెరిగి బ్యారెల్‌కు $92.30 వద్ద ట్రేడవుతోంది.


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటు, Q2 ఆదాయాలు, మ్యాక్రో ఎకనమిక్‌ ఇండికేటర్స్‌ మీద కూడా పెట్టుబడిదార్లు ఓ కన్నేసి ఉంచారు.


నిఫ్టీ 50, నిన్నటి (మంగళవారం) ముగింపు 19,811.50తో పోలిస్తే ఈ రోజు ఫ్లాట్‌గా 19,820.45 వద్ద ప్రారంభమైంది. 19,840.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని, 19,659.95 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్ 140 పాయింట్లు లేదా 0.71 శాతం నష్టంతో 19,671.10 వద్ద ముగిసింది.


సెన్సెక్స్, నిన్నటి ముగింపు 66,428.09తో పోలిస్తే ఈ రోజు 66,473.74 వద్ద ఓపెన్‌ అయింది. 66,475.27 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని, 65,842.10 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని టచ్‌ చేసింది. ఓవరాల్‌గా ఇది 551 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 65,877.02 వద్ద స్టే చేసింది.


BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.85 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం నష్టంతో ముగిసింది.


BSEలో లిస్ట్‌ అయిన మొత్తం కంపెనీ ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్‌లోని ₹323.8 లక్షల కోట్ల నుంచి ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి దాదాపు ₹321.4 లక్షల కోట్లకు పడిపోయింది. పెట్టుబడిదార్లు ఈ ఒక్క సెషన్‌లోనే దాదాపు ₹2.4 లక్షల కోట్ల మేర నష్టపోయారు.


నిఫ్టీ50లో టాప్‌ గెయినర్స్‌ - టాప్‌ లూజర్స్‌
సిప్లా (3.50 శాతం), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (2.18 శాతం), టాటా మోటార్స్ (1.76 శాతం) షేర్లు టాప్ గెయినర్స్‌గా రాణించాయి.


బజాజ్ ఫైనాన్స్ (2.95 శాతం), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.85 శాతం), NTPC (1.46 శాతం) షేర్లు టాప్ లూజర్స్‌గా మిగిలాయి. 


నిఫ్టీ50లోని 39 స్టాక్స్ నష్టాల్లో ముగియగా, మిగిలిన 11 లాభాలతో ముగిశాయి.


రంగాల వారీగా...


సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో... నిఫ్టీ బ్యాంక్ (1.17 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (1.28 శాతం), PSU బ్యాంక్ (1.67 శాతం), ప్రైవేట్ బ్యాంక్ (1.17 శాతం) ఒక శాతం పైగా లోయర్‌ సైడ్‌లో ముగిశాయి.


నిఫ్టీ ఫార్మా (0.78 శాతం), హెల్త్‌కేర్ (0.43 శాతం), మీడియా (0.27 శాతం), ఆటో (0.08 శాతం) గ్రీన్‌ కలర్‌లో క్లోజ్‌ అయ్యాయి. ఇవి మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: దసరాకు ముందే ఫెస్టివ్‌ బోనస్‌ ప్రకటించిన మోదీ సర్కార్‌, DA 4% పెంపు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial