Sugar Exports Ban: పండుగ సీజన్‌లో పంచదార రేట్లు భారీగా పెరగకుండా కొన్నాళ్లుగా యాక్షన్‌ ప్లాన్స్‌ అమలు చేస్తున్న కేంద్ర సర్కారు, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి చక్కెర ఎగుమతులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దీనివల్ల దేశీయంగా షుగర్‌ సప్లైస్‌ పెరిగి, ధరలు దారిలోకి వస్తాయి.


భారత్‌ నుంచి చక్కెర ఎగుమతిపై గతంలో విధించిన నిషేధం అక్టోబర్ 31, 2023 తర్వాత కూడా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెర, తెలుపు చక్కెర, సేంద్రీయ చక్కెర మీద తాజా నిర్ణయం వర్తిస్తుంది. ఈ ఫెస్టివ్‌ సీజన్‌లో చక్కెర ధరలు కొద్దికొద్దిగా పెరుగుతుండడంతో, వాటిని కంట్రోల్‌లో పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైన కొత్త షుగర్‌ సీజన్‌లో చక్కెర ఎగుమతులను భారత ప్రభుత్వం నిషేధించే అవకాశం ఉందని 'abp దేశం' గతంలోనే రిపోర్ట్‌ చేసింది.


DGFT నోటిఫికేషన్
చక్కెర ఎగుమతిపై నిషేధాన్ని అక్టోబర్ 31, 2023 తర్వాత కూడా కొనసాగిస్తూ, DGFT (Directorate General of Foreign Trade) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, యూరోపియన్ యూనియన్ (EU), అమెరికా (USA‌) ఈ నిషేధం పరిధిలోకి రావని, ఆయా దేశాలకు ఎగుమతులు యథావిధిగా కొనసాగుతాయని DGFT నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇవి CXL, TRQ కోటా కిందకు వస్తాయి. ఇతర అన్ని విషయాలు, నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కూడా నోటిఫికేషన్‌లో DGFT సూచించింది.


ప్రపంచంలో రెండో అతి పెద్ద చక్కెర ఎగుమతి దేశమైన భారత్‌, చక్కెర రేట్లను నియంత్రించి & దేశీయంగా లభ్యత పెంచడానికి ఎగుమతులపై గత సంవత్సరం నిషేధం విధించింది. అక్టోబర్ 31, 2023 వరకు చక్కెరను నియంత్రిత కేటగిరీలో ఉంచింది. ఇప్పుడు ఆ గడువును ఇంకా పొడిగించింది.


గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 11.1 మిలియన్ టన్నులను విదేశాలకు విక్రయించడానికి అనుమతించిన సెంట్రల్‌ గవర్నమెంట్‌, సెప్టెంబర్ 30తో ముగిసిన ప్రస్తుత సీజన్‌లో 6.1 మిలియన్ టన్నుల షుగర్‌ను మాత్రమే ఎక్స్‌పోర్ట్‌ చేయడానికి అనుమతించింది.


దేశంలో చక్కెరకు కృత్రిమ కొరత సృష్టించి, రేట్లను పెంచేందుకు వ్యాపారులు దొడ్డిదారి ప్రయత్నాలు చేస్తుండడంతో... అక్టోబర్ 12 నాటికి ఉత్పత్తి, పంపిణీ, డీలర్, రిటైలర్, అమ్మకాల పూర్తి డేటాను అందించాలని ప్రభుత్వం చక్కెర మిల్లులను ఆదేశించింది. అడిగిన సమాచారం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఆ ఇన్ఫర్మేషన్‌ మొత్తాన్ని నవంబర్ 10లోగా NSWS పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది.


గరిష్ఠ స్థాయిలో చక్కెర ధరలు 
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటీవలి రిపోర్ట్‌ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు సెప్టెంబర్ నెలలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది దాదాపు 13 సంవత్సరాల్లో అత్యధికం. ఎల్‌ నినో కారణంగా భారత్‌, థాయ్‌లాండ్‌లో చెరకు పంట కూడా దెబ్బతిందని, దాని ప్రభావం పంచదార రేట్లపై కనిపిస్తోందని సంస్థ వెల్లడించింది.


భారతదేశంలో మొత్తం చక్కెర ఉత్పత్తిలో సగానికి పైగా వాటా మహారాష్ట్ర, కర్ణాటకదే. ఈ సంవత్సరం ఆ రాష్ట్రాల్లో రుతుపవన వర్షాలు సగటున 50% తక్కువగా నమోదయ్యాయి.


2023/24 సీజన్‌లో భారతదేశ చక్కెర ఉత్పత్తి 3.3 శాతం తగ్గి 31.7 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA) తెలిపింది.


మరో ఆసక్తికర కథనం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాక్‌ టార్గెట్‌ ధరల్లో కోత, బ్రోకరేజ్‌లను మెప్పించని మార్జిన్స్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial